పవన్ కాన్వాయ్ వెళ్తుండగా ప్లకార్డులతో సత్యసాయి గోదావరి మంచినీటి పథకం కార్మీకుల నిరసన
మధురపూడి విమానాశ్రయంలో టీడీపీ శ్రేణుల కొట్లాట
పవన్ తీరుపై తాగునీటి పథకం కార్మీకుల ఆగ్రహం
ఏలూరు జిల్లాలో రోడ్ల దుస్థితిపై నిరసనల సెగ
ఇచ్చిన పత్రాలనే మళ్లీ ఇచ్చిన పవన్
కోరుకొండ/కొయ్యలగూడెం/ద్వారకాతిరుమల: తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ప్రజలు, కార్మీకుల నుంచి నిరసనల సెగ తగిలింది. కూటమి నేతల కొట్లాటలు, శ్రేణుల నుంచి నిరసనలు సైతం తప్పలేదు. పవన్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రాగా.. టీడీపీ శ్రేణులు రచ్చరచ్చ చేశాయి. పవన్‌ను కలిసేందుకు రుడా చైర్మన్, టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణచౌదరి, సీఎం చంద్రబాబు పర్యటనల కో–ఆర్డినేటర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కుమారుడు అభిరామ్ వర్గీయులు విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఎస్‌పీఎఫ్ సిబ్బంది, పోలీసులు అభిరామ్‌ను మాత్రమే అనుమతించి, బొడ్డు వర్గీయులకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులను బొడ్డు వర్గీయులు నిలదీశారు. పెందుర్తి అభిరామ్‌పై బూతు పురాణం అందుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, కొద్దిపాటి కొట్లాట చోటుచేసుకున్నాయి. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇరువర్గాలకు చెందిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కార్మీకుల నిరసన
సమస్యలు చెప్పుకుందామని వచ్చిన తమ పట్ల డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై శ్రీ సత్యసాయి గోదావరి తాగునీటి పథకం కార్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 52 మంది కార్మీకులకు ప్రభుత్వం 20 నెలలుగా జీతాలు, 34 నెలలుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించడం లేదు. మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా పవన్‌కళ్యాణ్‌కు గోడు వెళ్లబోసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చారు. కానీ, పవన్‌ను కలిసేందుకు కార్మీకులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మండిపడిన కార్మీకులు పవన్‌కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మధురపూడి సాయిబాబా ఆలయ సమీపాన ప్లకార్డులతో నిరసన తెలిపారు.
గ్రామాల్లో నిరసన సెగ
ఏలూరు జిల్లాలో పర్యటించిన పవన్ నిరసన సెగ ఎదుర్కోవాల్సి వచ్చింది. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్తుండగా.. కొయ్యలగూడెం మండం గంగన్నగూడెం, తిమ్మనకుంట గ్రామాల ప్రజలు రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపారు. తమ గ్రామాల్లోని రోడ్లను పట్టించుకోవాలని కోరుతూ ప్రజలు ప్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిలబడ్డారు. ఇవేవీ పట్టించుకోకుండానే పవన్ వెళ్లిపోయారు. అధ్వానంగా ఉన్న రాజవరం ప్రధాన రహదారిపై భారీఎత్తున ఎగసిపడిన దుమ్ము, ధూళి మధ్య కలెక్టర్ వెట్రిసెలి్వతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు.
పవన్ తమ గోడును వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు తమ గ్రామానికి చెందిన కూటమి నాయకులను నిలదీశారు. దీంతో కూటమి నాయకులు సైతం ప్లకార్డులను ప్రదర్శిస్తూ మూడు పుంతల రోడ్డు వద్ద గంగవరం గ్రామస్తులతో కలసి రోడ్డు సమస్యపై ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం తిరుగు ప్రయాణంలో అక్కడకు రాగా ఆందోళనకారులు కాన్వాయ్‌ను అడ్డుకుని చుట్టుముట్టారు. దీంతో కారులో నుంచే పవన్‌కళ్యాణ్ ఆందోళన కారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
ఇచ్చిన పత్రాలనే మళ్లీ ఇచ్చిన పవన్
ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన పవన్‌కళ్యాణ్ ఆ ఆలయ అభివృద్ధికి సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. స్థల పరిశీలన జరిపిన అధికారులు 30 ఎకరాలను కేటాయించారు. ఈ భూమికి సంబంధించిన హక్కు పత్రాలను ఈ ఏడాది మే 16న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి, మరికొందరితో కలసి శ్రీవారి దేవస్థానం ఈవో ఎన్‌వీఎస్‌ఎన్‌మూర్తికి అందజేశారు. తాజాగా సోమవారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పవన్ ఆ 30 ఎకరాల భూమికి సంబంధించిన హక్కు పత్రాలను మళ్లీ దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌కు అందించారు. ఒకే భూమికి సంబంధించిన పత్రాలు ఎన్నిసార్లు ఇస్తారని స్థానికులు గుసగుసలాడారు.


