వైద్య విద్యపై చంద్రబాబు సర్కారు కుట్ర మరోమారు బట్టబయలు
పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలన దశలోనే ఎన్‌ఎంసీ తిరస్కరణ
నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిని బోధన ఆస్పత్రిగా చూపిస్తూ సర్కారు దరఖాస్తు
పిడుగురాళ్ల ప్రాజెక్ట్ అసంపూర్ణంగా ఉండటంతో 2026–27కు 100 సీట్లు మంజూరు చేయలేమన్న ఎన్‌ఎంసీ
వాస్తవానికి 2024 ఎన్నికల నాటికే పురోగతిలో కళాశాల నిర్మాణం.. ఆస్పత్రి నిర్మాణం పూర్తి
చంద్రబాబు గద్దెనెక్కగానే ఏడాదిన్నరకు పైగా కళాశాల నిర్మాణం ఆపేసిన వైనం
పీపీపీకి ఇవ్వడానికే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం.. ఫలితంగా విద్యార్థులకు తీరని నష్టం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో వైద్య విద్యపై చంద్రబాబు కుట్రపూరిత వైఖరి మరోమారు బట్టబయలైంది. ఏడాదిన్నరకుపైగా పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆపేసిన చంద్రబాబు సర్కార్.. 2026–27లో 100 ఎంబీబీఎస్ సీట్లతో ఆ కళాశాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో కళాశాల అనుమతుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కు మొక్కుబడిగా దరఖాస్తు చేసి చేతులు దులిపేసుకుంది. ఫలితంగా పరిశీలన దశలోనే ఎన్‌ఎంసీ ఆ దరఖాస్తును తిరస్కరించింది.
బోధనాస్పత్రి అందుబాటులో లేకపోవడం, కళాశాలలో వసతులు అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేమని ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్, రేటింగ్‌బోర్డ్ మంగళవారం పిడుగురాళ్ల కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్టు తెలిసింది. కనీస మౌలిక వసతులు కల్పించడంలో సర్కారు అంతులేని నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు 100 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే దుస్థితి నెలకొంది.
నిర్మాణం గాలికొదిలేసిన బాబు సర్కారు
» రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి చేరువలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, మన విద్యార్థుల వైద్య విద్య కల సాకారం కావాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.8,500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వెనుకబడిన పల్నాడు ప్రాంతం కోసం పిడుగురాళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు.
» పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ.500 కోట్లతో అధునాతన వసతులతో కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని అప్పట్లోనే ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రూ.300 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. పిడుగురాళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 330 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి అనుమతులు ఇచ్చారు.
» కళాశాలకు అనుమతులు రాబట్టాలంటే తొలుత బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2024లోనే బోధనాస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేశారు. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా కళాశాల, హాస్టల్స్, ఇతర నిర్మాణాలను మెజార్టీ శాతం నిర్మించేశారు.
» 2024 ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు.. ప్రభుత్వ కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వైద్య కళాశాలల నిర్మాణం నిలిపేశారు. ఏకంగా 19 నెలలు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేసి.. 2026–27 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల కోసం దరఖాస్తు గడువు ముగుస్తున్న సమయంలో మొక్కుబడిగా దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా చూపించారు.
» దీంతో ‘కళాశాల – బోధనాస్పత్రి మధ్య 34 కిలోమీటర్ల దూరం ఉంది. కళాశాల ఇంకా నిర్మాణంలోనే ఉంది. కీలకమైన సదుపాయాలు లేకుండా కళాశాలకు అనుమతులు ఇవ్వలేం’ అంటూ ఎన్‌ఎంసీ దరఖాస్తును తిరస్కరించింది. చంద్రబాబు ప్రభుత్వం కళాశాల నిర్మాణం కొనసాగించి, ఆ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రారంభించి ఉంటే ఏకంగా 150 ఎంబీబీఎస్ సీట్లు రాబట్టకునే ఆస్కారం ఉండేది. ఇది ఇష్టం లేకే ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం వహించిందని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది.
» గతేడాది పాడేరు కళాశాలకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టడంలోనూ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఎన్‌ఎంసీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తేలికగా తీసుకుని వదిలేయడంతో సీట్ల పెంపు దరఖాస్తును ఎన్‌ఎంసీ తిరస్కరించింది. పీపీపీలో ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం చేస్తున్న కుట్రలతో రెండేళ్ల బాబు పాలనలో ఏకంగా 2,450 సీట్లను విద్యార్థులు కోల్పోయారు.


