
మద్యం నకిలీదో, కాదో తనిఖీకి సురక్ష యాప్
నకిలీ మద్యం వ్యవహారంపై శవరాజకీయం చేస్తున్నారు
ఇకపై బెల్టు షాపులు ఉండవు
ఆఫ్రికాను కాపాడే బాధ్యత మాదే
మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇకపై రాష్ట్రంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మడానికి వీలు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మద్యం నకిలీదో, నాణ్యమైనదో తనిఖీ చేసుకునేందుకు సురక్ష యాప్‌ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి ఆయన ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం వ్యవహారంపై ఐదుగురు ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారులు రాహుల్‌దేవ్ శర్మ, కె.చక్రవర్తి, మల్లికా గర్గ్, ఎక్సైజ్ శాఖ నుంచి మరో సీనియర్ అధికారిని ఇందులో సభ్యులుగా నియమిస్తామని చెప్పారు.
నకిలీ మద్యంపై సిట్ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు. ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారు చేయడం నేర్చుకుని దాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో ఇలాంటివి చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. నేరాలు చేసి వాటిని ఎదుటి వారిపై వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటపెట్టిందే తామని చెప్పారు. ఈ వ్యవహారంలో రాజీ ఉండదని, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. ఏ షాపులో మద్యం కొన్నా ఆ బాటిల్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన సురక్ష యాప్‌లో స్కాన్ చేస్తే అది ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఏ బ్యాచ్ వంటి వివరాలన్నీ వస్తాయని చెప్పారు.
ఒకవేళ అది నకిలీదైతే ఎర్రర్ వస్తుందని, వెంటనే ఆ వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. మద్యం షాపుల యజమానులూ ముందే తమ వద్దకు వచ్చిన బాటిళ్లను చెక్ చేసుకుని అమ్మేలా ఈ యాప్‌ను వృద్ధి చేశామన్నారు. సోమవారం నుంచి మద్యం వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో ఉంటుందని, మద్యం షాపుల వారికి 16వ తేదీ నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా మద్యం ఇకపై షాపుల్లో మాత్రమే అమ్మే అవకాశం ఉంటుందని, బెల్టు షాపులు ఉండవని చెప్పారు. బెల్టు షాపుల్లో అమ్మితే బెల్టు తీస్తామని హెచ్చరించారు. నకిలీ మద్యం వ్యవహారంపై శవ రాజకీయాలు చేస్తున్నారని, తండ్రి చనిపోతే ఐదేళ్లు శవ రాజకీయాలు చేశారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో 30వేల మందికి అనారోగ్యం
గత ప్రభుత్వంలో అమ్మిన మద్యం వల్ల 30 వేల మంది అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో మద్యం తాగి 27 మంది చనిపోతే కనీసం విచారణ జరపలేదని, పోస్టుమార్టం కూడా నిర్వహించలేదని చంద్రబాబు విమర్శించారు. అలాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ వేరే కారణాలతో చనిపోయిన వారిని నకిలీ మద్యం వల్ల మరణించారని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలని అంటున్నారని, అలా వేస్తే 10, 11 ఏళ్లు కాలక్షేపం చేయవచ్చని భావిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. నకిలీ మద్యం విషయంలో రాజకీయ కుట్ర కోణం ఉందని, దానికి సంబంధించిన విషయాలు మున్ముందు బయటపెడతామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లి ఆఫ్రికాను చెడగొట్టారని, ఆఫ్రికాను కూడా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గత ప్రభుత్వంలో డిస్టలరీ నుంచి సరఫరా వ్యవస్థ వరకూ అంతా తమ నియంత్రణలో పెట్టుకుని నేరాలు చేశారని విమర్శించారు. దానిపై జరుగుతున్న విచారణను పక్కదారి పట్టించేందుకే నకిలీ మద్యం ద్వారా డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.