బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏమాత్రం వ్యతిరేకించని సిట్
మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం మరోసారి బట్టబయలు
తాము చెప్పినట్లు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తే ఎంతకైనా బరితెగిస్తారనేందుకు ఇదే నిదర్శనం.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిట్ తీరు మొదటి నుంచీ ఇంతే
తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వక పోతే అరెస్ట్‌లు.. వేధింపులు
ప్రలోభాలతో టార్గెట్ చేసిన వారి పేర్లు చెబితే బెయిల్ వచ్చేలా సహకారం
కూటమి కుట్రలో భాగంగా వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో అప్రూవర్ డ్రామాకు రంగం సిద్ధం.. తప్పుడు సాక్ష్యాలతో లేని ఆధారాలు సృష్టించేందుకు బరితెగింపు
చట్టానికి పాతరేసి ఇష్టారాజ్యంగా తప్పుడు కేసును నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు
ఇలాగైతే న్యాయం, ధర్మం ఎక్కడుందని సర్వత్రా విమర్శలు, ఆవేదన
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. తాము చెప్పినట్లు విని తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తే అరెస్ట్ చేయకుండా, ముందస్తు బెయిల్‌కు సహకరిస్తామని ప్రలోభపెట్టిన సిట్.. ఆ మేరకు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో తమకు అనుకూలమైన విధంగా పేర్లు చెప్పించుకుని.. ఆపై ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించక పోవడం ఈ కుట్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అక్రమ కేసులో ప్రభుత్వం తీరు మొదటి నుంచి ఇలానే ఉంది. సిట్ ద్వారా ప్రలోభ పెట్టడం.. అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇప్పించుకోవడం.. టార్గెట్ చేసిన వ్యక్తుల పేర్లు చెప్పించడం.. తద్వారా కక్ష సాధింపే లక్ష్యంగా అడుగులు వేయడం పరిపాటిగా మారింది. తన కుట్రకు అనుకూలంగా వ్యవహరిస్తే అరెస్ట్ చేయకుండా వదిలేయడం.. బెయిల్ వచ్చేలా సహకరించడం.. లేదంటే అరెస్ట్ చేసి వేధించడమే పనిగా పెట్టుకుంది. వాస్తవానికి మద్యం అక్రమ కేసులో నిందితుడైన సత్య ప్రసాద్ ముందస్తు బెయిల్‌కు వెళ్లినప్పుడు సిట్ తీవ్రంగా అభ్యంతరం చెప్పాలి. అయితే అందుకు విరుద్దంగా చూసిచూడనట్లు మిన్నకుండి పోవడం ప్రభుత్వ పెద్దల కుతంత్రాన్ని బట్టబయలు చేస్తోంది.
ఇలాగైతే న్యాయం, ధర్మం ఎక్కడుంటుందని సర్వత్రా ఆవేదన, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్టానికి పాతరేసి ఇష్టానుసారం కేసును నడిపించడం ముమ్మాటికీ కుతంత్రమేనని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఉద్యోగి సత్య ప్రసాద్ ముందస్తు బెయిల్‌ను సిట్ మాట మాత్రంగానైనా వ్యతిరేకించక పోవడమే నిదర్శనమని ఎత్తి చూపుతున్నారు. కనీస ఆధారాలు కూడా లేకుండా నమోదు చేసిన ఈ కేసులో పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే చంద్రబాబు ప్రభుత్వం ఆధార పడిందన్నది ఇప్పటికే స్పష్టమైంది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాజకీయ వేధింపుల కోసం ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీసింది. కూటమి ప్రభుత్వ పెద్దలు, టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులు సూత్రధారులుగా సాగుతున్న ఈ పన్నాగంలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఉద్యోగి సత్య ప్రసాద్ తదితరులు పాత్రధారులుగా మారారన్నది తేటతెల్లమవుతోంది.
అవాస్తవాలు, అభూత కల్పనలతోనే కుట్ర
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ మూడు నెలలపాటు దర్యాప్తు చేసి, ఏమీ ఆధారాలు లేవని చేతులెత్తేయగా.. టీడీపీ వీర విధేయ ఐపీఎస్ అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. అనంతరం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతోనే ఈ కేసులో తమ కుట్రను అమలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. అందుకు వాసుదేవరెడ్డి మొదట్లో సమ్మతించ లేదు. దాంతో డిప్యూటేషన్ కాల పరిమితి ముగిసినా సరే ఆయన్ను రిలీవ్ చేయకుండా, కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన్ను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మూడు రోజులపాటు వేధించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, సిట్ వేధింపులు తట్టుకోలేక వాసుదేవరెడ్డి లొంగిపోయారు. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అదే బాటలో సత్య ప్రసాద్ కూడా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఈ కేసులో పలు డిస్టిలరీల ప్రతినిధులను విచారణ పేరుతో పిలిపించి వేధించారు. ఓ డిస్టిలరీ ప్రతినిధి కుటుంబ సభ్యులు సిట్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. రిటైర్డ్ కానిస్టేబుల్‌ను కూడా అక్రమంగా నిర్బంధించి వేధించారు. ఆయన కొడుకుతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలని ఒత్తిడి తెచ్చారు.
మద్యం విధానంతో సంబంధంలేని వారూ అరెస్ట్
ఈ కేసులో అరెస్టు అయిన రాజ్ కసిరెడ్డి చెప్పని వాంగ్మూలాన్ని చెప్పినట్టుగా న్యాయ స్థానానికి నివేదించారు. కాగా, ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం లేకపోవడంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది. ఇక అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలజీ గోవిందప్ప చెప్పని విషయాలు చెప్పినట్టుగా వాంగ్మూలం నమోదు చేశారు. ఆయన ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో సిట్ కుతంత్రం బయట పడింది. మద్యం విధానంతో ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్‌రెడ్డి తదతరులను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసి వేధించింది. ఈ విధంగా లేని ఆధారాలు సృష్టించేందుకు పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలపైనే సిట్ ఆధారపడి బరితెగించింది.
అరెస్ట్ లేకుండానే ముందస్తు బెయిల్.. ముమ్మాటికీ అప్రూవర్ కుట్రే
– తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లతో అప్రూవర్ కుట్రకు చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. నిందితులుగా ఉన్న వారిద్దరినీ అప్రూవర్లుగా మార్చి, ఈ కేసు నుంచి తప్పించాలని ఎత్తుగడ వేసింది. కాగా అరెస్టు కాకుండా అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గతంలో తోసిపుచ్చింది. ఈ విషయంలో సిట్ తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ముందస్తు బెయిల్ ఇస్తే తప్ప.. అప్రూవర్లుగా మారలేమన్న వారి ఉద్దేశం న్యాయ వ్యవస్థతో బేరసారాలు సాగించడమే అని వ్యాఖ్యానించింది. సిట్‌కు వారికి మధ్య బేరం కుదిరినట్టు ఉందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అప్రూవర్‌లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని.. విచారణ పూర్తయ్యే వరకు వారు కస్టడీలోనే ఉండి తీరాలని చెప్పింది.
– అనంతరం హైకోర్టు కూడా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిట్ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసింది. అనంతరం ఆయన బెయిల్ పిటిషన్‌ను సిట్ తరపు న్యాయవాదులు పెద్దగా వ్యతిరేకించక పోవడం గమనార్హం.
– తాజాగా సత్య ప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో కూడా సిట్ అదే తంత్రాన్ని అనుసరించింది. ఇక్కడ అరెస్ట్ అనే మాటకు తావే ఇవ్వలేదు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పట్ల సిట్ చిత్తశుద్ధితో వ్యవహరించ లేదు. ఈ నేపథ్యంలోనే సత్య ప్రసాద్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లను అధికారికంగా అప్రూవర్లుగా మార్చి.. వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు నమోదు చేయించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తర్వాతి అంకం అన్నది స్పష్టమవుతోంది.
– అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన కేసు పూర్తిగా అక్రమమేనన్నది తేటతెల్లమవుతోంది. ఎటువంటి అవినీతి లేని ఈ విధానంలో లేని ఆధారాలు సృష్టించేందుకే సిట్ ద్వారా ప్రభుత్వం కుట్రకు బరితెగిస్తోందన్నది సుస్పష్టమవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు సిట్.. చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని విమర్శిస్తున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపు కోసం అక్రమ కేసునే ఆయుధంగా చేసుకుంటున్నారని దుయ్యబడుతున్నారు.


