ఇదేంది సామీ.. సర్కారే ‘రియల్‌’ దందా! | Chandrababu govt Cheap land deals for real estate companies | Sakshi
Sakshi News home page

ఇదేంది సామీ.. సర్కారే ‘రియల్‌’ దందా!

Mar 30 2026 5:12 AM | Updated on Mar 30 2026 6:02 AM

Chandrababu govt Cheap land deals for real estate companies

రూ.1,200 కోట్ల పెట్టుబడికి రూ.1,400 కోట్ల లబ్ధి 

‘తిరుపతి వన్‌’ ప్రాజెక్టు ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వ భూ పందేరం

తిరుపతి సమీపంలో ఏకంగా 22 ఎకరాలు కేటాయింపు 

రూ.1,226.32 కోట్ల ప్రతిపాదిత ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు

మరో రూ.300కోట్ల–400 కోట్ల మేర వివిధ రకాల ప్రోత్సాహకాలు 

ఆతిథ్య రంగంలో కనీస అనుభవం లేని సంస్థలకు పర్యాటక ప్రాజెక్టు   

వేలం వేయకుండా ఎస్‌ఆర్‌వో రేటుకే కారు చౌకగా భూమి  

దివ్యశ్రీ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌–డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు అప్పనంగా దోచి పెడుతోంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కనీసం ఆతిథ్య రంగంలో అనుభవం లేని సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ భూములు కొల్లగొడుతోంది. పర్యాటక విధానం 2024–29 పేరిట  ఏకంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కోరినంత భూమిని.. అడిగిన రేటుకు మారు మాట్లాడకుండా కట్టబెడుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అత్యంత ఖరీదైన ప్రభుత్వ, పర్యాటక భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌–డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కన్సార్టియం ‘తిరుపతి వన్‌’ ప్రాజెక్టు కోసం తిరుపతి రూరల్‌ మండలంలోని దామినీడులో ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన 22 ఎకరాల భూమిని కారు చౌకగా కేటాయించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.

కారుచౌకగా కట్టబెట్టేలా స్కెచ్‌
పర్యాటక ప్రాజెక్టుల పేరుతో నచ్చినోళ్లకు నచ్చిన చోట విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్‌ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటి వరకు 99 ఏళ్లకు లీజు పేరుతో శాశ్వతంగా భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న సర్కార్‌.. తాజాగా మరో అడుగు ముందుకేసి, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు (ఎస్‌ఆర్‌వో) ప్రకారం రేటుకట్టి.. ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పాదాక్రాంతం చేస్తోంది. ‘తిరుపతి వన్‌’ ప్రాజెక్టులో భాగంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కేటాయించిన 22 ఎకరాల భూమి విలువ రూ.వెయ్యి కోట్లు పైమాటే. వాస్తవానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. ఈ క్రమంలో తిరుపతి రూరల్‌ మండలం దామినీడులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు అత్యంత డిమాండ్‌ నెలకొంది. అలాంటి చోట ఎకరం బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్ల వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఎస్‌ఆర్‌వో రేటుకు అమ్మేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. 

దివ్యశ్రీ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌–డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు భూములు కేటాయించడంతో పాటు పలు రాయితీలు కల్పిస్తూ  జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు 
  
ప్రైవేటు సంస్థ కోరితే.. భూమి అమ్మేస్తారా?
దివ్యశ్రీ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌–డెవలప్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు రెండూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు.. భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవడం, క్రయవిక్రయాలు చేయడం తప్ప ఆతిథ్య రంగంలో హోటళ్ల నిర్వహణ, హాస్పటాలిటీలో ఎటువంటి అనుభవం లేదని తెలుస్తోంది. అలాంటి ఈ సంస్థలు ‘తిరుపతి వన్‌’ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ కల్చరల్, ఎంఐసీఈ (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) డెస్టినేషన్‌ సెంటర్‌ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. 

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,226.32 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు 22 ఎకరాల భూమి ఇవ్వాలని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరగా, అందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. పెట్టుబడిదారు అభ్యర్థన మేరకు ప్రభుత్వం సబ్‌ రిజిస్టర్‌ విలువ ప్రకారం అప్పనంగా భూములు కట్టబెట్టడంపై ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వన్‌ ప్రాజెక్టులో భాగంగా ఏడు ఎకరాల్లో ఎంఐసీఈ కాంప్లెక్స్, మరో ఏడు ఎకరాల్లో 300 గదుల వెల్‌నెస్‌ జోన్, 250 గదులతో టైమ్‌ షేర్‌ సదుపాయం, 4 ఎకరాల్లో రెండు హోటళ్లతో హాస్పటాలిటీ జోన్‌ (5స్టార్‌ 200 గదులు, 3 స్టార్‌ 150 గదులు), 2 ఎకరాల్లో మల్టీప్లెక్స్‌ జోన్, 2 ఎకరాల్లో కల్చరల్‌ థీమ్‌ పార్కు నిర్మిస్తామని చెబుతోంది.

రూ.300–400 కోట్ల ప్రోత్సాహకాలు
చంద్రబాబు సర్కార్‌ తిరుపతి వన్‌ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఇవ్వడమే కాకుండా అనేక ప్రోత్సాహకాల కింద రూ.వందల కోట్లు తిరిగి చెల్లించనుంది. కేపిటల్‌ సబ్సిడీ కింద రూ.40 కోట్లు ప్రభుత్వమే సంస్థకు ముట్టజెప్పుతోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ రీయింబర్స్, ఐదేళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్, ఐదేళ్లు విద్యుత్‌ సుంకం రీయింబర్స్‌.. ఇలా ప్రోత్సాహకాలన్నీ కలిపి ఏకంగా రూ.300–400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తోంది. 

⇒ వాస్తవంగా ఈ ప్రోత్సాహక మొత్తాన్ని చూస్తే ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఎస్‌ఆర్‌వో విలువ ప్రకారం విక్రయించే భూమి రేటు కంటే అధికంగా ఉండటం గమనార్హం. రూ.1,226.32 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ.వెయ్యి కోట్ల భూమి ఇవ్వడమే కాకుండా రూ.300–400 కోట్లు విలువైన ప్రోత్సాహకాలతో కలుపుకుని రూ.1,300–1,400 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది.

⇒ పైగా పెట్టుబడిదారులకు ఆస్తి భరోసా కల్పించడం ద్వారా ఫ్రీ హోల్డ్‌ ప్రాతిపదికన భూమిని కేటాయించడంతో వాళ్లకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌ను పొందడానికి, అంతర్జాతీయ హాస్పిటాలిటీ, వెల్నెస్‌ ఆపరేటర్ల భాగస్వామ్యంతో సహా ప్రపంచ వ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి వీలు కలుగుతుందని ఉచిత సలహా ఇస్తోంది. రేపో మాపో అధికారిక సర్వే నిర్వహించి 22 ఎకరాల భూమిని తిరుపతి వన్‌ ప్రాజెక్టు కోసం అప్పగిస్తామని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

ఎందుకు వేలం వేయలేదు?
రాష్ట్రంలో ఎక్కడైనా సరే విలువైన భూములను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే విషయంలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. పొరుగునే ఉన్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వేలం నిర్వహించి, ఎక్కువ రేటు ఇచ్చే సంస్థలకు ఆయా ప్రభుత్వాలు భూములను అప్పగిస్తున్నాయి. తద్వారా పోటీ పెరిగి మంచి ధర వస్తుంది. తిరుపతి లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంలో హోటళ్లకు గానీ, భక్తులకు సంబంధించిన వసతుల కోసం గానీ.. ఏ ప్రాజెక్టుల కోసమైనా సరే ఇచ్చే భూములకు వేలం నిర్వహిస్తే మంచి ధర వస్తుందనే విషయం తెలిసీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా, కారుచౌకగా భూములు కట్టబెట్టడం వెనుక అవినీతి, బినామీ బాగోతం దాగి ఉందని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement