
ఫీజుల ఖరారులో తీవ్ర జాప్యం
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత అడ్మిషన్లు ఇవ్వకపోయినా చోద్యం
పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలకు మూడో విడత అడ్మిషన్లకు శ్రీకారం
స్కూళ్ల పరిధిని 3 నుంచి 5 కిలో మీటర్లకు పెంపు
ప్రభుత్వ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. సకాలంలో ఒక్క నిర్ణయం తీసుకోకుండా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఇప్పటికే ఫీజుల ఖరారులో తీవ్ర జాప్యం చేసింది. ఆ సాకుతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు నిరాకరించినా చోద్యం చూస్తోంది. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో మరోసారి ఆర్టీఈ కింద అడ్మిషన్ల పేరుతో కొత్త నాటానికి తెరతీసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం నోటిఫికేషన్ ఇచి్చంది. జూన్‌లోనే పూర్తవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టులోనూ కొనసాగించడం గమనార్హం.
నష్టం జరిగాక తీరిగ్గా ఫీజుల నిర్ణయం
ఆర్టీఈ చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ప్రతి విద్యా సంవత్సరం మే నెలలో నోటిఫికేషన్ ద్వారా ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత గల విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తుంది. గత మూడు విద్యా సంవత్సరాలు సక్రమంగా జరిగిన ఈ ప్రక్రియ 2025–26లో మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెండు విడతల్లో 31,701 మంది పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో సీట్లు కేటాయించారు.
అయితే, ప్రభుత్వం చెల్లించే ఫీజులను సకాలంలో ఖరారు చేయలేదు. దీంతో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిపోవడంతో జూలైలో కొందరు పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా ప్రభుత్వం జూలై 24వ తేదీన ఫీజులు ఖరారు చేసింది. అప్పటికే విద్యార్థులకు నష్టం జరిగిపోయింది. మొత్తంమ్మీద 31,701 మందిలో సగం మందే ఆర్టీఈ కింద సీట్లు
పొందినట్లు సమాచారం.
ఇప్పుడు అడ్మిషన్లు ఇస్తాం.. ఫీజు కట్టుకోండి..
ఇప్పటి వరకు ఆర్టీఈ కింద సీట్లు పొందేందుకు విద్యార్థుల ఇళ్లకు 3 కి.మీ. పరిధిలోని ప్రైవేటు స్కూళ్లకే అవకాశం ఉంది. ఆ పరిధిని 5 కి.మీ. వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆసక్తి చూపేవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు ఆర్టీఈ కింద సీట్లు పొందేవారు ఫీజును స్వయంగా చెల్లించుకుంటామని రాసివ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వాస్తవానికి పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఆర్టీఈ ప్రవేశాలను పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.