ఇటు తగులు.. అటు మిగులు | Chandrababu conspiracy against medical aspirants | Sakshi
Sakshi News home page

ఇటు తగులు.. అటు మిగులు

Aug 9 2025 5:36 AM | Updated on Aug 9 2025 5:36 AM

Chandrababu conspiracy against medical aspirants

బాబు సర్కారు మెడి‘సిన్‌’ శాపం డిమాండ్‌ అధికం.. సీట్లు నిల్‌ 

వైద్యవిద్య ఆశావహుల పాలిట చంద్రబాబు కుట్ర

పెరుగుతున్న పోటీకి తగ్గట్టుగా సీట్ల పెంపునకు చర్యలేవీ? 

గతేడాది కన్వినర్‌ కోటా ప్రవేశాల కోసం 13,849 మంది దరఖాస్తు 

ఈ దఫా 15 వేలకు పెరిగిన విద్యార్థుల సంఖ్య.. సీట్లు మాత్రం పెరగని దుస్థితి 

ప్రభుత్వ పీపీపీ నిర్ణయంతో రెండేళ్లలో 2,450 సీట్లు నష్టపోతున్న రాష్ట్ర విద్యార్థులు

రాష్ట్రంలో కీలకమైన వైద్య, సాంకేతిక విద్యలు గాడి తప్పుతున్నాయి. ప్రభుత్వ విధానపర నిర్ణయాల వల్ల ఈ దుస్థితి దాపురించింది. చంద్రబాబు కూటమి సర్కారు గద్దెనెక్కాక కుటిల నీతితో మెడిసిన్‌ సీట్లు తగ్గిపోతుంటే.. ఇంజినీరింగ్‌ విద్యకు ఆదరణ లేకుండా పోతోంది. ఫలితంగా ఇంజినీరింగ్‌ సీట్లలో మిగులు.. మెడికల్‌ సీట్లలో తగులు కనిపిస్తోంది.  – సాక్షి, అమరావతి 

వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల పాలిట చంద్రబాబు పాలన శాపంగా మారింది. వైద్య విద్యకు పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఎంబీబీఎస్‌ సీట్ల పెంపునకు ప్రభుత్వం కనీస చొరవ చూపడం లేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం మన విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. రాష్ట్రంలో ఏటా వైద్య విద్యకు డిమాండ్‌ పెరుగుతోందని కన్వీనర్‌ కోటా సీట్ల కోసం పోటీ పడే విద్యార్థుల సంఖ్య స్పష్టం చేస్తోంది. 

2024–25 విద్యా సంవత్సరంలో కన్వినర్‌ కోటా ప్రవేశాల కోసం 13,849 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగింది. కన్వినర్‌ కోటా ప్రవేశాల కోసం ఇటీవల హెల్త్‌ వర్సిటీ దరఖాస్తులు ఆహ్వా­నించగా 15వేల మంది వరకూ దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడైంది. ఇలా గతంతో పోలిస్తే పోటీ పెరిగినా అదే స్థాయిలో సీట్లు మాత్రం పెరగని దుస్థితికి చంద్రబాబు విధానపర పాపమే శాపమని స్పష్టంగా తేలిపోయింది. 

సీట్లు తిరోగమనం
నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) 2025–26 విద్యా సంవత్సరానికి వైద్య కళాశాలలు, వాటిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లను ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్రానికి కొత్తగా ఒక్క కళాశాల కూడా మంజూరు కాలేదు. అదనంగా సీట్లు మంజూరు కాలేదు. దీనికితోడు వైజాగ్‌ గాయత్రి వైద్య కళాశాలలో అడ్మిషన్లపై నిషేధించడంతో సీట్లు  తగ్గిపోయాయి. 

గతేడాది సీట్‌ మ్యాటిక్స్‌ ప్రకారం రాష్ట్రంలో 36 ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉండగా వీటిల్లో 6,510 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4,046 కన్వినర్‌ సీట్లు రాష్ట్ర కోటా కింద భర్తీ చేశారు. కాగా, ఈ ఏడాది గాయత్రిలో 200 సీట్లపై నిషేధం విధించడంతో ఈ దఫా కన్వినర్‌ కోటాలో 100 సీట్లు తగ్గి 3,946 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

రెండేళ్లలో 2,450 సీట్లు నష్టం  
ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1050 సీట్లు సమకూరాల్సి ఉంది. అయితే వైద్య కళాశాలల నిర్మాణాలన్నింటినీ గద్దెనెక్కిన రోజు నుంచే చంద్రబాబు నిలిపేయించారు. గతేడాది ప్రారంభానికి నోచుకోని నాలుగు కళాశాలలతోపాటు, ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఏడింటిలో ఏ ఒక్క కళాశాలకూ అనుమతుల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేయలేదు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు.

కుట్రలతో కలలు ఛిద్రం
పేద ప్రజలకు ఉచిత సూపర్‌స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడం కోసం గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కళాశాలలు 2023–24లో ప్రారంభమై 750 సీట్లు సమకూరాయి. అలాగే 2024–25లో ఐదు, 2025–26లో ఏడు కళాశాలలు ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా గతేడాది 2024–25కు ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 సీట్లు రాబట్టడానికి ఏర్పాట్లు చేశారు. కాగా, ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన బాబు కళాశాలలను ప్రైవేట్‌కు అప్పజెప్పాలని నిర్ణయించారు. 

అంతటితో ఆగకుండా గతేడాది ప్రారంభం కావాల్సిన కళాశాలలపై కుట్రలు పన్నారు. బాబు ప్రభుత్వం చేసిందేమీ లేకున్నా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కృషితో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) పులివెందుల మెడికల్‌ కళాశాలకు 50 ఎంబీబీఎస్‌ సీట్లతో గతేడాదే అడ్మిషన్లకు అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వం అండర్‌ టేకింగ్‌ ఇచ్చి ఉంటే మిగిలిన కళాశాలలకు ఇదే మాదిరిగా సీట్లు మంజూరు చేయడానికి ఎన్‌ఎంసీ సుముఖంగా ఉన్నప్పటికీ కళాశాలలు మేం నిర్వహించలేమంటూ బాబు ప్రభుత్వం లేఖలు రాసింది. 

దీంతో ఎన్‌ఎంసీ మంజూరు చేసిన సీట్లను రద్దు చేసేసింది. ఒక్క పాడేరు వైద్య కళాశాల మాత్రమే 50 సీట్లతో ప్రారంభమైంది. ఈ క్రమంలో గతేడాది ఏకంగా 700 సీట్లు నష్టపోయి మన విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే మన దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నీట్‌లో 100 నుంచి 150 మేర ఎక్కువ స్కోర్‌ చేసినా సీట్లు పొందలేక వైద్య విద్యకు దూరం అయ్యారు. 

విద్యార్థులకు మేలు చేసే ఆలోచనే లేదు 
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో కొత్త కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం ఎత్తేస్తామన్నారు. గత ఏడాది ఎత్తేయలేదు. ఈ ఏడాదైనా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం ఎత్తేయాలి. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు లబ్ధి చేయాలనే ఉద్దేశమే ఈ ప్రభుత్వంలో ఎక్కువగా కనపిస్తోంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు మేలు చేయాలనే ఆలోచనే లేకుండా పోయింది. యోగా డే, అమరావతి పునఃప్రారంభం ఇలా రకరకాల ఆర్భాటపు కార్యక్రమాలకు రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలంటే మాత్రం నిధుల కొరతను సాకుగా చూపిస్తున్నారు. – డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్, ఏపీ మెడికోస్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌

ఇంజి‘నీరుగారిపోయే’..! 
రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ (బీటెక్‌) కన్వినర్‌ కోటా తొలి దశ సీట్ల భర్తీ అనంతరం కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌ఈ) ఆధారిత కో­ర్సు­ల సీట్లు భారీగా ఖాళీ ఉన్నాయి. ఒక్క సీఎస్‌ఈ, అనుబంధ కోర్సుల్లో 15,850 సీట్లు మిగిలిపోయాయి. 2025–­26 విద్యా సంవత్సరానికి కన్వినర్‌ కోటాలో 1,52,246 సీ­ట్లు ఉండగా తొలి దశ కౌన్సెలింగ్‌­లో 1,18,525 సీట్లు భర్తీ అ­య్యాయి. ఇంకా 33,721 సీట్లు మిగిలి ఉండటం గమనార్హం. ఈసీఈలో 6404, ఈ­ఈ­ఈలో 3409 సీట్లు, మెకానికల్‌లో 3090, సివిల్‌లో 2747 సీట్లు భర్తీకి నోచుకోలేదు.  కాగా, స్థానికత అంశంపై విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో ఫేజ్‌–2 సీట్ల అలాట్‌మెంట్‌ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది. 

66 బ్రాంచుల్లో సున్నా ప్రవేశాలు 
ఏపీ ఈఏపీ సెట్‌లో ఇంజినీరింగ్‌కు సంబంధించి 1.84లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 1.26లక్షల మంది అర్హత సాధించారు. వీరిలో 1.24లక్షల మంది వెబ్‌ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. ఇందులో 1,18,525 మంది సీట్లు పొందారు. వివిధ కళాశాలల్లో 66 బ్రాంచుల్లో సున్నా ప్రవేశాలు నమోదవడం గమనార్హం. ఇలా సున్నా ప్రవేశాలు వచి్చన కోర్సుల్లో సీట్ల సంఖ్య 1,908గా ఉన్నాయి. మరోవైపు 51 కళాశాలల్లో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. ఒక్క కళాశాలలో మాత్రమే ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో 427 సీట్లలో అన్నీ భర్తీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement