‘బ్లూజీన్‌’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు 

Chandrababu appeared in the court through BlueJean - Sakshi

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా ప్రత్యేక యాప్‌ వినియోగం 

బాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్‌  

టీడీపీ లీగల్‌ టీంపై చంద్రబాబు అసహనం! 

సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ శుక్రవారంతో పూర్తయిన నేపథ్యంలో వర్చువల్‌ విధానం ద్వారా ఆయన్ను ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. అత్యాధునిక ‘బ్లూ జీన్‌’ యాప్‌ ద్వారా ఆయన్ను రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ నుంచి ఉదయం 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. మామూలుగా ఖైదీలను వర్చువల్‌ విధానం అంటే వీడియో కాల్‌ ద్వారా కోర్టులో హాజరు పరుస్తుంటారు. అప్పుడు కోర్టులో ఉన్న జడ్జిలు వారి స్థానం నుంచి మరో చోటుకు వెళ్లాల్సి వచ్చేది.

అయితే చంద్రబాబుకు అత్యంత భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో బ్లూ జీన్‌ యాప్‌ను వినియోగించినట్లు తెలిసింది. దీనిద్వారా జడ్జి తన ఛాంబర్‌లో కూర్చొనే విచారణ చేయొచ్చు. ఖైదీ సైతం తనకు కేటాయించిన బ్యారక్‌లో నుంచే కోర్టు ఎదుట హాజరు కావచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటిసారిగా ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రిమాండ్‌ ఖైదీని కోర్టులో హాజరు పరిచినట్లు ఓ అధికారి తెలిపారు.   ఇదిలా ఉండగా, సెంట్రల్‌ జైల్లో చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్‌ అయ్యారు.

క్వాష్‌ పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా టీడీపీ లీగల్‌ టీంపై బాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించినట్లు తెలిసింది. ఎంత ఖర్చు అయినా సరే.. టాప్‌ లాయర్లను రంగంలోకి దింపాలని సూచించినట్లు సమాచారం. ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారుల్లో వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అనంతరం నేడు జరగబోయే కస్టడీ విచారణపై చర్చించినట్లు తెలిసింది.  

పట్టాభికి భంగపాటు  
టీడీపీ నేత పట్టాభికి రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ వద్ద భంగపాటు ఎదురైంది. జైలు వద్ద ఉన్న మీడియా పాయింట్‌కు వచ్చిన ఆయన.. కాసేపట్లో తీర్పు వస్తుందని, బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, ప్రభుత్వంపై పోరాటం చేస్తారని ప్రకటించారు. ఇదిజరిగిన కొద్ది గంటల్లోనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ కొట్టేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో కోర్టులో ఉన్న అంశాలపై ఎందుకు మాట్లాడారని పార్టీలోని కొందరు పెద్దలు పట్టాభికి క్లాస్‌ పీకినట్లు తెలిసింది.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top