విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి

Central Govt On Management of Schools from 9th to 12th Class - Sakshi

9 నుంచి 12వ తరగతి వరకు విద్యాలయాల నిర్వహణపై కేంద్రం

సాక్షి, అమరావతి: విద్యార్థుల హాజరుకు సంబంధించి వారి తల్లిదండ్రుల లిఖిత పూర్వక అంగీకారం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని.. ప్రతిరోజూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేయాలని సూచించింది. అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈనెల 21వ తేదీ నుంచి 9, 10, ఇంటర్‌(11, 12) తరగతుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. స్వచ్ఛంద ప్రాతిపదికన విద్యాలయాల్లో కార్యకలాపాలను పాక్షికంగా పున:ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి సమ్మతి తీసుకోవాలని నిబంధన విధించింది. 

కేంద్రం చేసిన సూచనలు, జాగ్రత్తలు 
► కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. విద్యా సంస్థల్లో మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లు, ఆక్సీమీటర్లు ఏర్పాటు చేయాలి. 
► కంటైన్‌మెంటు జోన్ల వెలుపల ఉన్న వాటినే తెరవాలి. అలాగే ఆ జోన్లలో నివసిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు రావడానికి అనుమతించకూడదు. 
► 50 శాతం సిబ్బందిని మాత్రమే విద్యాలయాల్లోకి అనుమతించాలి. వారిని కూడా ఆన్‌లైన్‌ బోధన, టెలీ కౌన్సెలింగ్‌ కోసం రప్పించాలి. 
► సమావేశాలు, క్రీడలు నిర్వహించకూడదు. రద్దీకి దారితీసే కార్యక్రమాలపై నిషేధం. 
► జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే వారిని వేరే గదిలో ఉంచి తల్లిదండ్రులకు తెలియజేయాలి. సమీప ఆస్పత్రిలో వైద్యం అందే ఏర్పాటు చేయాలి. 
► ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు దూరంగా ఉండాలి. బయోమెట్రిక్‌ హాజరుకు బదులు ప్రత్యామ్నాయ పద్ధతిని వినియోగించాలి. సందర్శకులను అనుమతించకూడదు. 
► విద్యార్థులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూడాలి. తరగతి గదుల్లో వీలైనంత వెంటిలేషన్‌ ఉండాలి. ఏసీ గదుల్లో తగిన ఉష్ణోగ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top