ఇక ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో బుకింగ్‌ 

Cargo booking In RTC buses - Sakshi

మరింత సులభతరం కానున్న కొరియర్‌ సేవలు 

సాక్షి, అమరావతి: ఇకనుంచి ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్,  కార్గో బుకింగ్‌కు అవకాశం కల్పించాలని సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కొరియర్, కార్గో బుకింగ్‌ చేయాలంటే ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏజెంట్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణీత ఆర్టీసీ బస్సు వద్దకే వెళ్లి కొరియర్, కార్గో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది.  ప్రస్తుతం రాష్ట్రంలో 94 ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లతోపాటు 422 మంది ఏజెంట్ల ద్వారా కొరియర్, కార్గో బుకింగ్‌ సేవలు అందిస్తున్నది. రోజుకు సగటున 20,500 బుకింగ్‌ల ద్వారా రూ.40లక్షల రాబడి ఆర్జిస్తోంది. కాగా 2022–23లో రోజుకు సగటున 40వేల బుకింగ్‌లతో రూ.68లక్షలు రాబడి సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా నిర్ణయించుకుంది.

తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250కోట్లు రాబడి సాధించాలన్నది ఆర్టీసీ ప్రణాళిక. రాష్ట్రంలో 672 మండలాల్లోని 14,123 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తోంది. ఇకనుంచి ఖాతాదారులు సంబంధిత బస్సు వద్దకు వెళ్లి నేరుగా కండక్టర్‌ వద్దే పార్సిల్‌ బుకింగ్‌ చేసుకునే సౌలభ్యం కలిగించనుంది. బుకింగ్‌ చేసుకున్న తరువాత సత్వరమే పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరుతాయి. ఇందుకోసం టిమ్‌ మెషిన్ల ద్వారా కొరియర్‌ బుకింగ్‌ చేయడం, రశీదు ఇవ్వడం, ఇతర అంశాలపై కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కొరియర్‌ బుకింగ్‌ మొత్తాన్ని టికెట్‌ కలెక్షన్ల మొత్తంగా చూపించే వే బిల్లుతో కాకుండా.. విడిగా నమోదు చేస్తారు.

కొరియర్‌ బుకింగ్‌లు బాగా చేసే కండక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది.  రాష్ట్రంలో మొదటగా గుంటూరు జిల్లా ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో సేవల బుకింగ్‌ సదుపాయాన్ని ప్రారంభిస్తామని, అనంతరం నెలరోజుల్లోనే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు ‘సాక్షి’కి తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top