క్రెడిట్ చోరీకి పన్నాగం
1996 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం నాటి సీఎంగా వెలిగొండకు చంద్రబాబు శంకుస్థాపన
1996 నుంచి 2004 మధ్య ఈ ప్రాజెక్టుకు వెచ్చించింది కేవలం రూ.పది లక్షలే
అదీ శంకుస్థాపన శిలాఫలకం.. ఆ సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసమే
జలయజ్ఞంలో భాగంగా రూ.3,581.58 కోట్లు వ్యయం చేసి సింహభాగం పనులు పూర్తి చేయించిన మహానేత వైఎస్సార్
2014 నుంచి 2019 మధ్య దోపిడీకి ప్రయోగశాలగా వెలిగొండను మార్చుకున్న చంద్రబాబు
జీవో 22, 63లను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లు దోచిపెట్టిన వైనం
చంద్రబాబు దోపిడీని బహిర్గతం చేసిన కాగ్ నివేదిక
రెండో సొరంగం పనులకు రివర్స్ టెండరింగ్‌తో గత జగన్ సర్కారు రూ.61.76 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు తన దైన శైలిలో మరో క్రెడిట్ చోరీకి పన్నాగం పన్నుతున్నారు. విశాఖలో డేటా సెంటర్, భూముల సమగ్ర రీసర్వే, గత ప్రభుత్వం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడానికి పాట్లు పడుతున్న ఆయన చూపు ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. శనివారం మార్కాపురం జిల్లాలో గంటావానిపల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను పరిశీలించిన ఆయన.. అక్కడే నిర్వాసితులు, రైతులతో సమావేశమయ్యారు. ఆ ప్రాజెక్టు పనులను 1996లో తానే ప్రారంభించానని, ఇప్పుడు తానే పూర్తి చేస్తున్నానంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ క్రెడిట్ చోరీకి తెర తీశారు.
వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది.
వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించి, రూ.992 కోట్లు వ్యయం చేసి, పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితోనే నిర్వాసిత కుటుంబాలకు రెండేళ్లుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం వచ్చి .. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని ఎత్తి చూపుతున్నారు. 2024లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా జలాలను 2024లోనే నల్లమలసాగర్‌కు మళ్లించి.. దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ సర్కార్ హయాంలో నాసిరకంగా పనులు
వైఎస్సార్‌సీపీ సర్కార్ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్ సీజన్‌లో కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఒడిసిపట్టి.. నల్లమలసాగర్‌కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షం అయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్ పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ ఛానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్‌కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టడం గమనార్హం.
హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్
» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు.
» 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చి న వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు.
» 2014–19 మధ్య టీడీపీ సర్కార్ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు.
» రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు.
» 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది.
» రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు.
» వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది.
» శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. జగన్ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం.
» వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండ్రస్టియల్ మాన్యుపాక్చరింగ్ జోన్)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఇవ్వడం ద్వారా భారీ ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు.
స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్
» శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కిలోమీటర్ల పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్‌కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని 1993–94లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు.
» మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
» తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో 2004 అక్టోబర్ 27న పనులకు శ్రీకారం చుట్టారు.
» జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా 21.8 కిలోమీటర్ల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులు చేపట్టారు.
అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబు సర్కార్ దోపిడీ
» 2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్
» 1995లో ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు.
» విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా, పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించక పోవడమే చంద్రబాబు సర్కార్ చేసిన దోపిడీకి నిదర్శనం. జీవో–22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచి పెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయక పోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు
నిదర్శనం.
» 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలు ఇస్తూ వచ్చి న చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది.
» 2014–19 మధ్య ఫీడర్ కెనాల్‌లో చంద్రబాబు సర్కార్ హయాంలో అత్యంత నాసిరకంగా పనులు చేశారు. 2024లో కురిసిన భారీ వర్షాలతో ఫీడర్ కెనాల్‌లో చేరిన వరద నీటికి అది కోతకు గురై దెబ్బతింది. దాంతో ఆ అక్రమాలను కప్పిపెట్టే ముసుగులో ఫీడర్ కెనాల్‌కు రిటైనింగ్ వాల్, లైనింగ్ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి.. కమీషన్లు దండుకున్నారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.


