Botsa Satyanarayana Comments On Chandrababu Over Amaravati Issue, Details Inside - Sakshi
Sakshi News home page

నేను చెప్పింది నిజమో, కాదో.. చంద్రబాబును అడగండి: మంత్రి బొత్స

Published Fri, Oct 21 2022 2:27 PM

Botsa Satyanarayana Comments On Chandrababu Over Amaravati issue - Sakshi

సాక్షి, అనకాపల్లి: అనాదిగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ప్రాంతానికైనా వలసలు ఉత్తరాంధ్ర నుంచే జరుగుతున్నాయని, అక్షరాస్యతలోనూ ఈ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.

విశాఖ పరిపాలన రాజధాని అనేది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పరిపాలన రాజధానిని అందరూ నిలబెట్టుకోవాలని.. అప్పుడే మిగతా ప్రాంతాలతో సమానంగా తమ ప్రాంతం ఎదగగలదని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ. 6,000 కోట్లు ఖర్చు చేశారని, అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు చేసి ఖర్చు చేశారని ప్రస్తావించారు. మిగతా 1,500 కోట్లలో వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇక పోతే చంద్రబాబు తన అయిదేళ్ల కాలంలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ నుంచి అమరావతికి ఖర్చు చేశారని గుర్తు చేశారు. అమరావతిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలంటే ఐదు నుంచి ఆరు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు.

పరిపాలన రాజధానిగా విశాఖ వద్దనడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు సిగ్గుందా అని, ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు. ఒకే సామాజిక వర్గానికి రాష్ట్ర సంపద దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది సీఎం జగన్‌ విధానమని స్పష్టం చేశారు. 
చదవండి: మనకు నాయకుడు ఒక్కడే.. మన నాయకుడి నినాదం ఒక్కటే

‘అమరావతిలో భవనం నిర్మించాలంటే 110 నుంచి 135 అడుగుల లోతు పునాది కోసం తవ్వాలి. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. బడ్జెట్ మొత్తం, జీతాలు సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతుంది. నేను చెప్పింది అబద్ధమో.. నిజమో చంద్రబాబు, యనమల రామకృష్ణడు చెప్పాలి. నేను చెప్పింది అబద్ధం అయితే తలదించుకుంటాను. విభజన చట్టంలోనే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి.

ఏ సినిమా నటుడు వచ్చినా ప్రజలు చూడడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చినంత మాత్రాన రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల మనసు మారదు. చనిపోయిన సిల్క్‌ స్మిత వచ్చినా ఇంతకంటే ఎక్కువమంది వస్తారు. పాదయాత్రకు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేయాలి. ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. పాదయాత్ర జరుగుతున్న సమయంలో బైక్ ర్యాలీలు, నిరసనలు తెలపడం, నల్ల బ్యాడ్జీలు ధరించడం, స్వచ్ఛందంగా షాపులు మూసివేయడం, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేయాలి. జేఏసీ తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా మేము మద్దతుగా ఉంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Advertisement
Advertisement