ఎన్ని విమర్శలు వచ్చినా.. విద్యార్థులకు మంచి చేయాలనేదే లక్ష్యం

Botsa Satyanarayana Comments At Andhra layola College Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్య ఒక్కటే అనే విధానంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందులో భాగంగా విద్యా రంగంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మొదట అమలు చేసేది ఆంధ్రప్రదేశ్‌లోనేనని వ్యాఖ్యానించారు. మేధావులు, విద్యావేత్తలు అయిన సి.వి.రామన్, అబ్దుల్ కలాం, రామానుజన్ జీవితాలను ప్రతి ఒక్క విద్యార్ధి ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులంతా తమ దైనందిన కార్యక్రమాల్లో సైన్సుకు సంబంధించిన అంశాలను గుర్తించి.. వాటిపై పరిశోధనలు చేసే స్థాయికి రావాలన్నారు.

ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని.. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన వంటి పథకాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు. విద్యా రంగంలో చేస్తున్న మార్పుల వల్ల విమర్శలు వస్తున్నా.. లెక్క చేయకుండా విద్యార్థులకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

విద్యార్థులు మరింత హుందాగా కనిపించాలన్న యోచనతో వచ్చే సంవత్సరం విద్యార్థుల యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గతంలో ఢిల్లీలో విద్యా విధానం బాగుందని వార్తల్లో చూసే వాళ్ళం.. నేడు ఏపీలో ఢిల్లీని మించిన విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. సమాజ శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తు ప్రధాన ఆశయంగా పాఠశాల విద్యను మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top