విజయనగరం జిల్లా: కూటమి నేతలు దోపిడీకి అలవాటు పడ్డారని మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గజపతినగరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ‘‘40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో వస్తూ ఉంటారు... పోతూ ఉంటారు.
ఒకరు పోతే వంద మంది వస్తారు. ఇప్పుడు కూటమి నేతల తీరు చూస్తూ ఉంటే బీపీ పెరిగి పోతుంది. కూటమి నేతలు దోపిడీకి అలవాటు పడ్డారు. అలీబాబా 40 దొంగలు తీరులా వీళ్లంతా ఒకటయ్యారు. సెటిల్‌మెంట్లు అన్నీ పోలిస్ స్టేషన్లల్లో, ఎండీవో ఆఫీసుల్లో జరుగుతున్నాయి. ఇదీ కూటమి ప్రభుత్వ తీరు. మీ వెంటే... అప్పలనర్శయ్య తో పాటుగా నేను. మా పిల్లలు ఉంటారు. పార్టీ బోలేపేతానికి కృషి చెయ్యండి’’ అని అన్నారు.
కాగా, గజపతినగరం నియోజకవర్గంలో బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, పెనుమత్స సురేష్ బాబు, పార్లమెంటు ఇన్‌చార్జ్ సత్యనారాయణ, గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జి జగన్ మోహన్ రావు హాజరయ్యారు.


