
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీని వరుస బాంబు బెదిరింపులు హడలెత్తించాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు శనివారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీలను, ప్లాట్‌ఫారమ్‌లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు.
విజయవాడ రైల్వే స్టేషన్‌లో(Vijayawada Railway Station) బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన అగంతకుడు.. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు అధికారులు వెల్డించారు. ఆ కాల్ మహారాష్ట్ర లాతూర్ నుంచి వచ్చిందని, ఆగంతకుడు హిందీలో మాట్లాడాడని తెలిపారు. జీఆర్‌పీ, సీఎస్‌డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు జరిపారు. ఎల్‌టీటీ రైలు నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించాం. ఎవరు కాల్ చేశారో విచారణ చేస్తున్నాం అని ఆర్‌పీఎఫ్ ఏఎస్పీ వెల్లడించారు.
అంతకు ముందు.. నగరంలోని బీసెంట్ రోడ్‌కు (Besant Road) బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్ రోడ్‌లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖపట్నం: ఇటు వైజాగ్ రైల్వే స్టేషన్‌లోనూ ‘బాంబు’ అలజడి రేగింది. ఎల్టీఐ ఎక్స్‌ప్రెస్(లోకమాన్య తిలక్ టెర్మినస్-విశాఖ)లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు కాల్‌చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే బాంబు స్క్వాడ్ తనిఖీలు జరిపింది. ఎస్ 2 కోచ్‌లో అనుమానాస్పద బ్యాగ్ గుర్తించింది. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
