
సాక్షి, వైఎస్సార్: జమ్మలమడుగులో పారిశ్రామికవేత్తలపై కూటమి నేతల అరాచకం మరింత పెరిగింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై జిల్లా కలెక్టర్‌కు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
వివరాల ప్రకారం.. జమ్మలమడుగులో అన్ని కాంట్రాక్టులు తమకే కావాలంటూ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి కూటమి నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరుల దాదాగిరి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతీ ఒక్క కాంట్రాక్టూ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, ఇప్పటికే కాంట్రాక్టు నిర్వహిస్తున్న వారిని బయటకు పంపలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఒత్తిడితో కొన్ని కాంట్రాక్టులు ఇచ్చినా ఆదినారాయణరెడ్డి వర్గం శాంతించలేదు. ఫ్యాక్టరీ ముడిసరుకు, సిమెంట్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను అడ్డుకున్నారు.
సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సరుకు బయటకు వెళ్లకుండా బస్సులు అడ్డుపెట్టి మరీ అరాచకం సృష్టిస్తున్నారు. దీంతో, ఓ ప్లాంటులో ఉత్పత్తి ఆగిపోగా, మరో ప్లాంటులోనూ ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అరాచకంపై కంపెనీ యాజమాన్యం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసు భద్రత ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం.
అయితే, ఫ్యాక్షన్ పోకడలతో పారిశ్రామికవేత్తలను ఆదినారాయణరెడ్డి వేధిస్తున్నారు. మూడు నెలల క్రితం అదానీ పవర్ ప్లాంటుపైకి కూడా ఇదే విధంగాదాడి చేసిన ఆదినారాయణరెడ్డి వర్గం దాడి చేసింది. ఆర్టీపీపీ ఫ్లైయాష్ తరలింపులోనూ అంతా తామే చేయాలని రగడ సృష్టించింది. అప్పట్లో జేసీ వర్గంతో తలపడ్డ ఆదినారాయణరెడ్డి వర్గం.. జేసీ వాహనాలను అడ్డగించిన విషయం తెలిసిందే. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో జిల్లాకు పరిశ్రమలు రాకుండా పోతాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.