పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి 

Biswabhusan Harichandan on Universities and colleges - Sakshi

విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్ల సదస్సులో గవర్నర్‌ విశ్వభూషణ్‌ 

సాక్షి, అమరావతి: గుణాత్మక పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రాధాన్యమివ్వాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. పరిశోధన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర పరిశోధన మండలిని ఏర్పాటు చేయడం గొప్ప ముందడుగని చెప్పారు. విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లతో విజయవాడ రాజ్‌భవన్‌లో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నూతన జాతీయ విద్యావిధానం స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తోందన్నారు. ఉన్నత విద్యావ్యవస్థ సంస్థాగత స్వయం ప్రతిపత్తి దిశగా పయనించేందుకు నూతన జాతీయ విద్యావిధానం సహకరిస్తుందని చెప్పారు.

అందుకోసం పాఠ్యాంశాల పునరుద్ధరణ, బోధన, మూల్యాంకనం, విద్యార్థుల అనుసరణీయత, ఉత్తమ బోధకుల పాత్ర వంటి అంశాలు మిళితమై ఉన్నాయన్నారు. ఇంజనీరింగ్, సంప్రదాయ డిగ్రీ కోర్సుల రీడిజైన్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు విధానాన్ని ప్రవేశపెట్టి ఒక ఏడాది పరిశోధనలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేసేలా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ యువత ఆధునిక వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యేలా కార్యాచరణను చేపట్టినట్లు తెలిపారు.

విద్యాశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీకి తగినట్టుగా మన విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. సదస్సుకు హాజరైన 23 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లు గవర్నర్‌కు నివేదికలు సమర్పించారు. గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కె.రామమోహనరావు, కార్యదర్శి బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top