సాక్షి,విజయవాడ: ఏపీలో బీచ్ బార్ల పేరిట మందు బాబులతో భారీగా మద్యం తాగించాలని చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. బీచ్ షాక్స్ పేరుతో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ 362 జీవో ఇచ్చింది.12 జిల్లాల్లో ఏపీటీడీసీ గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటుకు విధివిధానాల్ని రూపొందించింది.
మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఎంపిక చేసిన బీచ్‌లలో ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు బీచ్ షాక్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్‌లలో ఏర్పాటుకు ప్రతిపాదన తెచ్చింది.
బీచ్‌లలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే.. ‘విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? అంటూ బాలకృష్ణ అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ అందుబాటులోకి తేవడంలో నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా..
ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్‌లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు.


