breaking news
beach shacks
-
బీచ్ షాక్స్ పై గళం ఎత్తిన YSRCP మహిళా నేతలు
-
బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్సీపీ
సాక్షి,విశాఖ: కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘బీచ్ షాక్స్’ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వైజాగ్‌తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో పాల్గొన్నారు. బీచ్ రోడ్ అంతటా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ప్రదర్శనకు పార్టీ అగ్రశ్రేణి నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ర్యాలీలో వరుదు కళ్యాణి, బొత్స ఝాన్సీ లక్ష్మి, గొల్ల బాబురావు, పార్టీ నేత కేకే రాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు స్వయంగా పాల్గొని మహిళలకు అండగా నిలిచారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ.. గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకువచ్చి, పవిత్రమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే, ఇకపై ఇక్కడికి కుటుంబాలు, విద్యార్థులు, మహిళలు ధైర్యంగా వచ్చే వాతావరణం ఉంటుందా? అని ప్రశ్నించారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో మహిళల భద్రతను, ప్రజల శాంతిని పణంగా పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు బీచ్ షాక్స్ ప్లాన్, జగన్ ఏమన్నారంటే..
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలకు విశ్రాంతి, వినోదానికి కేంద్రాలుగా ఉండాల్సిన బీచ్‌లను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బీచ్ షాక్స్ పేరుతో కొత్త మద్యం సంస్కృతికి ప్రభుత్వం తెరలేపుతోందని, ఇది రాష్ట్ర సామాజిక వాతావరణానికి ప్రమాదకరమని గుర్తు చేశారు.తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్, బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలను ప్రోత్సహించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీచ్‌లు కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ప్రశాంతంగా గడిపే ప్రదేశాలుగా ఉండాలే తప్ప, మద్యం విక్రయాల కేంద్రాలుగా మారకూడదన్నారు."బీచ్ షాక్స్ పేరుతో మద్యం అమ్ముతారా? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం మొత్తం కలిసి బీచ్‌కు ఎలా వెళ్తారు?" అని జగన్ బాబు సర్కార్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం, లాకప్ డెత్‌లు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జగన్ ఆరోపించారు. "చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?" అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, అవినీతి, దోపిడీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. "రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం లేదు. కానీ దోచుకున్న సొమ్ము మాత్రం విదేశాలకు వెళ్తోంది" అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
ఏపీ బీచ్‌లలో మద్యం అమ్మకాలు.. ఎప్పటి నుంచంటే?
సాక్షి,విజయవాడ: ఏపీలో బీచ్ బార్ల పేరిట మందు బాబులతో భారీగా మద్యం తాగించాలని చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. బీచ్ షాక్స్ పేరుతో ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ 362 జీవో ఇచ్చింది.12 జిల్లాల్లో ఏపీటీడీసీ గుర్తించిన చోట్ల బీచ్ షాక్స్ ఏర్పాటుకు విధివిధానాల్ని రూపొందించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఎంపిక చేసిన బీచ్‌లలో ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 2029 ఆగస్టు వరకు బీచ్ షాక్స్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్‌లలో ఏర్పాటుకు ప్రతిపాదన తెచ్చింది.బీచ్‌లలో మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే.. ‘విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? అంటూ బాలకృష్ణ అల్లుడు, టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ అందుబాటులోకి తేవడంలో నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా.. ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్‌లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు.


