బీసీ హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత | BC Hostel students fall ill | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత

Oct 11 2025 5:37 AM | Updated on Oct 11 2025 5:37 AM

BC Hostel students fall ill

ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న బీసీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు

వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతూ పెదనందిపాడు పీహెచ్‌సీలో చేరిన 54 మంది విద్యార్థులు 

ఫుడ్‌ పాయిజనే కారణమని ప్రాథమికంగా అంచనా

విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు

ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు శాపంలా మారింది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలేయడంతో సరైన వసతులు, నాణ్యమైన ఆహారం లేక బాలబాలికలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తాజాగా, ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడి ఆస్పత్రి పాలైన ఘటన పెదనందిపాడు మండలంలో చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ బాలుర వసతి గృహంలో మొత్తం 107 మంది విద్యార్థులు ఉన్నారు. గురువారం రాత్రి భోజనం తిన్న తర్వాత 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో హాస్టల్‌లో వార్డెన్‌ లేకపోవడంతో, అందుబాటులో ఉన్న కుక్‌ సీహెచ్‌ కల్పన తొలుత 17 మంది విద్యార్థులను పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. 

మిగిలిన విద్యార్థులు కూడా ఒకరి తరువాత ఒకరు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక హైసూ్కల్‌ ఉపాధ్యాయులు ఆటోల్లో విద్యార్థులను పెదనందిపాడు పీహెచ్‌సీకి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.   

కలెక్టర్‌ ఆదేశాలతో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, బాధిత విద్యార్థులందరికీ చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 21 మందిని డిశ్చార్జి చేయగా, 17 మంది విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి ఆహారం కలుషితం కావడమేనని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు.


‘ఏకలవ్య’కూ సోకిన పచ్చ కామెర్లు
» పాఠశాలలో 380 మంది విద్యార్థులు.. వారిలో 30 మంది పచ్చ కామెర్లు  
»పలు ఆస్పత్రుల్లో వీరికి వైద్యం 
»ఇప్పటికే కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు పచ్చ కామెర్లు  
»రెండు పాఠశాలలూ పక్క పక్కనే.. ఒకే తాగు నీటి బోరు 
» ఆ బోరు పక్కనే మురుగు  
కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య పాఠశాలలో 30 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు (హెపటైటిస్‌–ఏ) సోకినట్లు సమాచారం. 380 మంది విద్యార్థులు చదువుతుండగా.. వీరిలో 30 మంది విద్యార్థులు పచ్చకామెర్లు, వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 17 మంది, కేజీహెచ్‌లో ఇద్దరు, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. ఏడుగురు విద్యార్థులు డిశ్చార్జ్‌ అయినట్లు ఏకలవ్య సిబ్బంది చెబుతున్నారు. పాఠశాల సిబ్బందికి కూడా ఒకరికి పచ్చకామెర్లు సోకినట్టు తెలిసింది. 

ఆ బోరు నీరే కారణమా..
కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇప్పటికే పచ్చ కామెర్లతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చేరారు. పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు మృతిచెందారు. గురుకుల పాఠశాలకు పక్కనే ఏకలవ్య పాఠశాల ఉంది. రెండు పాఠశాలల విద్యార్థులు ఒకే  బోరు నీటిని తాగుతుండడం, అదే బోరు సమీపంలో మురుగు నీరు ఉండటంతోనే విద్యార్థులు కామెర్ల బారిన పడినట్టు ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement