ఫోర్టిఫైడ్‌ బియ్యంతో  ఆరోగ్యం పదిలం | AU Pharmacy Department research on Fortified rice | Sakshi
Sakshi News home page

ఫోర్టిఫైడ్‌ బియ్యంతో  ఆరోగ్యం పదిలం

Jun 5 2022 6:06 AM | Updated on Jun 5 2022 8:22 AM

AU Pharmacy Department research on Fortified rice - Sakshi

ఏయూక్యాంపస్‌: ఫోర్టిఫైడ్‌ బియ్యంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. బియ్యానికి అదనంగా విటమిన్లు, ఖనిజాలను జోడించడాన్ని రైస్‌ ఫోర్టిఫికేషన్‌ అంటారు. ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి 12 వంటి కీలక సూక్ష్మ పోషకాలను అదనంగా బియ్యంలో చేర్చడం ద్వారా పోషకాహార లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేపట్టింది.  

కళాశాల ఆచార్యులు, ఏయూ పాలక మండలి సభ్యురాలు ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్‌ నేతృత్వంలో బి.ఫార్మసీ విద్యార్థులు ప్రాజెక్టులో భాగంగా చేసిన అధ్యయనంలో  ఫోర్టిఫైడ్‌ బియ్యంలో ఫోలిక్‌ యాసిడ్, ఐరన్‌ పుష్కలంగా ఉన్నట్లు తేలింది.

ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఎందుకు వాడాలి..
పౌష్టికాహార లోపం బారినపడే మహిళలు, చిన్నారులకు ఫోర్టిఫైడ్‌ బియ్యం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. ఐసీడీఎస్, ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ పథకాల్లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ను పంపిణీ చేయడం వల్ల సూక్ష్మపోషకాలను అందించడం సాధ్యపడుతుంది.  

ఫోలిక్‌ యాసిడ్‌..
ఫోలిక్‌ యాసిడ్‌ బాలింత తల్లుల పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పసిపిల్లలలో మెదడు, వెన్నెముక పెరుగుదలకు తోడ్పడుతుంది. అదే విధంగా విటమిన్‌ బి 12 మెదడు, నాడీమండలం పనిచేయడానికి, ఎర్రరక్తకణాల ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని సరైన మొత్తంలో ఉంచుతూ రక్తహీనతను అరికట్టడంలో ఐరన్‌ ప్రధానపాత్ర పోషిస్తుంది.

నిత్యం 400 మైక్రో గ్రామ్స్‌ అవసరం.. 
మనం నిత్యం తీసుకునే ఆహారంలో 400 మైక్రో గ్రామ్స్‌ ఫోలిక్‌ యాసిడ్‌ ఉండే విధంగా మనం జాగ్రత్త వహించాలి. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా మనం తీసుకునే 100 గ్రాముల అన్నంలో ఫోలిక్‌ యాసిడ్‌ 75 నుంచి 125 మైక్రోగ్రామ్స్‌ మధ్యలో ఉండాలి.

ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్‌ రైస్‌లో 100 గ్రాముల్లో  98 మెక్రో గ్రామ్స్‌ ఫోలిక్‌ యాసిడ్‌ ఉంది. ఎఫ్‌ఎస్‌సీఐ ప్రమాణాల ప్రకారం 100 గ్రాముల అన్నంలో 28–42 మిల్లీ గ్రాముల ఐరన్‌ ఉండాలి. ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్‌ బియ్యంలో 40 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంది. ఇతర ప్రైవేటు ఫోర్టిఫైడ్‌ బియ్యంలో 35 నుంచి 36.5 మిల్లీ గ్రాములు ఐరన్‌ కనిపించింది. కాగా అధికంగా వినియోగించే బ్రాండెడ్‌ మసూరి రైస్‌లో కేవలం 0.98 శాతం ఐరన్‌ ఉన్నట్లు తేలింది.

నాలుగు రకాల బియ్యంపై అధ్యయనం..
ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్‌ బియ్యం శాంపిల్‌తో పాటు మార్కెట్‌లో లభించే మూడు రకాల ఫోర్టిఫైడ్‌ బియ్యం బ్రాండ్‌ల శాంపిల్స్‌తోపాటు సాధారణ సోనామసూరి బియ్యం శాంపిల్స్‌ తీసుకుని అధ్యయనం చేశారు. అధ్యయనం అనంతరం ఫలితాలను విశ్లేషించగా ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్‌ బియ్యంలో ఫోలిక్‌ యాసిడ్‌ 98 శాతం ఉండగా, మిగిలిన మూడు ఫోర్టిఫైడ్‌  రైస్‌ బ్రాండ్‌లలో ఫోలిక్‌ యాసిడ్‌ శాతాలను పరిశీలించగా 96, 97.24,95, ప్రముఖ బ్రాండ్‌ సోనా మసూరి రైస్‌లో 93 శాతం ఫోలిక్‌యాసిడ్‌ ఉండడాన్ని గమనించారు.  

మరింత లోతైన పరిశోధనలు 
విద్యార్థుల పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా నిలపాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ప్రభుత్వం కోరితే బి 12 శాతం సైతం గణించి ఇస్తాం. ఈ బియ్యం వినియోగించిన తరువాత శరీరంలో ఐరన్‌శాతం పెరుగుదలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే పరిశోధన ప్రాజెక్టుగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.
– ఆచార్య ఎ.కృష్ణమంజరి పవార్, ఫార్మసీ కళాశాల, ఏయూ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement