క్యాంపస్‌లో కొలువుల్లేవు | AU engineering students face placement difficulties | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌లో కొలువుల్లేవు

Jun 26 2025 6:05 AM | Updated on Jun 26 2025 4:45 PM

AU engineering students face placement difficulties

గతంలో సగటున 1,200 నుంచి 1,600 ఉద్యోగాలకు ఆఫర్‌ లెటర్లు  

ఇప్పుడు 185 ఉద్యోగాలకు పడిపోయిన దుస్థితి 

ఏయూ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ కష్టాలు

ఆంధ్రా యూనివర్సిటీలో నారాయణ (పేరు మార్చాం) అనే విద్యార్థి 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్‌ (సీఎస్‌) పూర్తి చేశాడు. ప్రముఖ కంపెనీలేవీ ప్లేస్‌మెంట్స్‌ కోసం రాకపోవడంతో గాయత్రీ కాలేజీలో జరిగే ఆఫ్‌–క్యాంపస్‌ సెలక్షన్స్‌కు వెళ్లి టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఒక్క నారాయణే కాదు 20 మంది ఏయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.  

ఈ అమ్మాయి పేరు రేపాక ఈశ్వరి. 2022–23 విద్యా సంవత్సరంలో ఏయూలో సీఎస్‌ పూర్తి చేసిన ఈ అమ్మాయికి అట్లాసియన్‌ కంపెనీలో రూ.84.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఆఫర్‌ లెటర్‌ను అప్పటి ఏయూ వీసీ ప్రసాదరెడ్డి అందించారు. ఆ ఏడాది ఈ అమ్మాయికే కాదు 1,001 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆఫర్‌ లెటర్స్‌ అందించారు.  

2023 మే 1వ తేదీన బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘అచీవర్స్‌ డే’ ఘనంగా నిర్వహించి 1,001 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఆఫర్‌ లెటర్స్‌ను అందించారు. ఆ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.84.5 లక్షలు!

2025లో ఏయూలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారిలో పట్టుమని 20 శాతం మందికి కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లేని పరిస్థితి. ఆఫ్‌–క్యాంపస్‌లో గాయత్రీ కాలేజీకి వెళ్లి అక్కడ సెలక్షన్స్‌లో 20 మంది ఏయూ విద్యార్థులు టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.12 లక్షలు! 

ఇదీ గత ప్రభుత్వ హయాంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు... కూటమి ప్రభుత్వంలో ఏయూలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థుల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు మధ్య ఉన్న తేడా.  

20 లక్షల ఉద్యోగాల పేరుతో...! 
వాస్తవానికి ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని... లేనిపక్షంలో నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి నేతలు ప్రకటించారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి ఏయూలో ఇంజినీరింగ్‌ సీటు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకే సాధ్యమవుతుంది. అటువంటి విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సంపాదించడం  కష్టమేమీ కాదు.   కూటమి ప్రభుత్వం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌పై కనీస శ్రద్ధ వహించక పోవడంతో  వేరే ప్రాంతాలకు వెళ్లి ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.   

ఉద్దేశపూర్వకంగానే...! 
వాస్తవానికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు సంస్కరణలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఏయూలో గణనీయ అభివృద్ధి జరిగింది. నూతన పోకడలకు అనుగుణంగా ఏయూలో కొంగొత్త మార్పులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్‌ను ఏర్పాటు చేశారు. 

పేటెంట్ల కోసం ఏకంగా వందకుపైగా దరఖాస్తుల చేయడం ద్వారా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శకంగా నిలిచింది. మేథో సంపత్తి హక్కులను (పేటెంట్స్‌) పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేథో సంపత్తి హక్కుల కేంద్రం (ఐపీటీ)ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డి 2020 సెపె్టంబరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా వందకిపైగా దరఖాస్తులను పంపారు. 

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఏయూ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిందనే రీతిలో ప్రచారం చేస్తూ... విచారణ పేరుతో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ కంపెనీలను పిలిచి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ను నిర్వహించడం లేదు.  

Advertisement
 
Advertisement
Advertisement