
బీసీ బాలుర హాస్టల్లో సీనియర్ల అఘాయిత్యం
పల్నాడు జిల్లాలో ఘటన
దాచేపల్లి: కరెంట్ షాక్‌తో ఒక విద్యార్థిపై సీనియర్లు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం శ్రీనగర్‌కి చెందిన ఒక విద్యార్థి నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దాచేపల్లికి చెందిన ఒక విద్యార్థి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఈ నెల 7న జూనియర్ కళాశాలలో ఉన్న ఇంటర్ విద్యార్థిని డిగ్రీ విద్యార్థి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహానికి పిలిపించి, అతన్ని బంధించి, తన స్నేహితులతో కలిసి తీవ్రంగా కొట్టాడు.
ఒక దశలో కరెంట్ షాక్ పెట్టి ఇంటర్ విద్యార్థిని హత్య చేసేందుకూ ఉపక్రమించాడు. దాడి దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించాడు. వారి నుంచి తప్పించుకున్న బాధిత ఇంటర్ విద్యార్థి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. మరో దివ్యాంగ విద్యార్థినిని కూడా అదే డిగ్రీ విద్యార్థి, అతడి స్నేహితులు హాస్టల్‌లోనే కొట్టినట్లు సమాచారం.
కాగా, బాధిత ఇంటర్ విద్యార్థి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వసతి గృహంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటున్నాయని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన డిగ్రీ విద్యార్థి మత్తు పదార్థం సేవించి హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బీసీ బాలుర వసతి గృహానికి ఒక మహిళా వార్డెన్‌ని ఎలా ఉంచుతారని ప్రశ్నించారు.
ప్రేమ వ్యవహారమే కారణం: డీఎస్పీ జగదీష్
ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నట్లు గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. దాడికి గురైన, దాడికి పాల్పడిన విద్యార్థులంతా మైనర్లేనన్నారు.