పెళ్లైనా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం | Assassination in Vijayawada Arundalpet | Sakshi
Sakshi News home page

పెళ్లైనా పాత బంధాన్ని వదల్లేక కిరాతకం

Oct 8 2026 5:02 AM | Updated on Oct 8 2026 5:02 AM

Assassination in Vijayawada Arundalpet

ప్రియురాలి గొంతు కోసి, పొడిచి హత్య   

సంబంధం కొనసాగింపునకు నిరాకరించడం వల్లే దురాగతం  

ఆపై గాయాలు చేసుకుని కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నం   

స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలింపు   

ప్రియురాలు తనకు చేతబడి చేసిందంటూ కొత్త ఎత్తుగడ 

విజయవాడ అరండల్‌పేటలో దారుణం 

లబ్బీపేట(విజయవాడ తూర్పు): మరో వివాహిత మోజులో పడి పెళ్లైనా భార్యతో సరిగా గడపలేకపోయాడు ఆ ప్రబుద్ధుడు. నిత్యం నువ్వే గుర్తుకొస్తున్నావంటూ పాత బంధాన్ని కొనసాగించాలని ప్రియు­రాలిని వేధించాడు. దీనికి ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా వెళ్లి గొంతు కోసి కసిదీరా పొడిచి హత్య చేశాడు. అనంతరం తానూ గాయాలు చేసుకుని కాలు­వలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యా­రావుపేట సీఐ చవాన్‌ కథనం ప్రకారం.. విజయవాడ అరండల్‌పేటకు చెందిన మహిళ (33)కు పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈమె కుటుంబం మూడేళ్ల పాటు అరండల్‌పేట­లోని నాగరాజు ఇంట్లో అద్దెకు ఉన్నారు. 

ఆ సమ­యంలో నాగరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగరాజుకు పెళ్లి కుదరడంతో ఆమె కుటుంబం మూడు నెలల కిందటే పక్క ఇంట్లోని రెండో అంతస్తుకు మారింది. నాగరాజుకు పెళ్లైనా భార్యతో సరిగా ఉండడం లేదు. తనతో సంబంధం కొనసాగించాలని మహిళను తీవ్రంగా వేధిస్తున్నాడు.  మళ్లీ తమ ఇంట్లోకి అద్దెకు రావాలని  ఆమెతో పాటు, భర్తను అడుగుతున్నాడు. దీనికి మహిళ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ తరుణంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో నాగరాజు కత్తి తీసుకుని వెళ్లి దాడి చేశాడు. గొంతుకోసి శరీరంపై కసిదీరా పొడిచి చంపేశాడు. శరీరంపై 15 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అనంతరం తానూ చనిపోవాలని భావించి పొట్టపై, గొంతుపై గాయం చేసుకున్నాడు. భవనంపై నుంచి దిగివచ్చి పక్కన ఉన్న కాలువలో దూకాడు. స్థానికులు గమనించి నాగరాజును ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే తనకు చేతబడి చేయడం వల్లే ఆమెను మరిచిపోలేకపోతున్నానని, అందుకే చంపేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు మహిళ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement