భారత్లో 19.5 కోట్ల ఉద్యోగాలకు గండం
సెంటర్ ఫర్ ఫైనాన్స్–ఎకనమిక్స్ రీసెర్చ్ నివేదిక
సాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో భారత్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పెను ప్రభావం చూపనుంది. ఏకంగా 19.5 కోట్ల ఉద్యోగాలకు గండం ముంచుకొస్తోందని సెంటర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. అదే సమయంలో ఉద్యోగాల్లో నైపుణ్యాలను కూడా ఏఐ మెరుగుపరుస్తుందని పేర్కొంది. చెన్నైకు చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఏఐ ప్రభావంపై అధ్యయనం నిర్వహించింది.
నివేదికలో ముఖ్యాంశాలివీ..
» భారత్లో 24.6 శాతం ఉద్యోగాలు ఏఐ ప్రభావం పరిధిలోకి రానున్నాయి.
» దేశంలో 19.5 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఆటోమేషన్ ప్రభావం పడనుంది. ఆటోమేషన్ ఫలితాలను బట్టి ఆ ఉద్యోగులను ఏ మేరకు కొనసాగించాలనేది నిర్ణయిస్తారు.
» మహిళలు నిర్వహిస్తున్న ఉద్యోగాల్లో 37.6శాతం, పురుషులు నిర్వహిస్తున్న ఉద్యోగాల్లో 28.4 శాతం ఏఐ ఆటోమేషన్ ప్రభావానికి గురికానున్నాయి.
» ఉద్యోగాలపై ఏఐ ప్రభావం అత్యధికంగా ఉండే రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 42శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడనుంది. ఆ తరువాత స్థానాల్లో 37.9శాతంతో హరియాణా రెండో స్థానంలో, 32.9 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి.ఏఐ ప్రభావంతో దేశంలో 8% ఉద్యోగాల్లో ఉద్యోగుల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది.
» ఏఐతో దేశంలో నిరుద్యోగిత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే 15ఏళ్లు నుంచి 34 ఏళ్ల వయసు ఉన్నవారిలో 1.87 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో మొత్తం నిరుద్యోగిత కంటే 20 ఏళ్ల నుంచి 29ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారిలో నిరుద్యోగిత రెట్టింపు ఉంది. దేశంలో 25 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు.
» ఇక 15 ఏళ్ల నుంచి 24ఏళ్లలోపు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఉన్నవారి రొటీన్ పనితోనే సరిపెట్టుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో రొటీన్ పనిలో నిమగ్నమైనవారు 55 శాతం మంది ఉన్నారు.


