నకిలీ సీబీఐ అధికారుల అరెస్టు

Arrest of fake CBI officers by YSR District Police - Sakshi

కాంట్రాక్ట్‌ అధ్యాపకుడిని కిడ్నాప్‌ చేసి.. రూ.1,14,000 గుంజిన వైనం

నవంబర్‌ 27న బాధితుడి ఫిర్యాదు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్సార్‌ జిల్లాలో ఘటన

కడప అర్బన్‌: సీబీఐ అధికారులమని బెదిరించి.. ఓ కాంట్రాక్ట్‌ అధ్యాపకుడిని కిడ్నాప్‌ చేసి అతని వద్దనుంచి కారు, రూ.1,14,000 కాజేసిన నలుగురు ఘరానా మోసగాళ్లను వైఎస్సార్‌ జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి తన కార్యాలయంలో తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నవంబర్‌ 23వ తేదీ రాత్రి సుమారు 7:19 గంటల సమయంలో చెన్నూరు పీఎస్‌ పరిధిలోని ఇర్ఖాన్‌ సర్కిల్‌ వద్ద ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన కాంట్రాక్ట్‌ అధ్యాపకుడు బేరి ఉదయ్‌కుమార్‌(37)ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తాము సీబీఐ అధికారులమని, విచారణ చేయాలని కారులో ఎక్కించుకున్నారు. అక్కడక్కడా తిప్పుతూ అతడిని కొట్టి, బెదిరించి రూ.1,14,000ను ఫోన్‌పే ద్వారా వారి అకౌంట్లలోకి జమ చేసుకున్నారు.

రెండ్రోజుల అనంతరం 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉదయ్‌కుమార్‌ను రోడ్డుపై వదిలి పరారయ్యారు. దీనిపై బాధితుడు నవంబర్‌ 27న చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన కడప అర్బన్‌ సీఐ ఎస్‌ఎం అలీ, చెన్నూరు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం ఉదయం కొక్కరాయపల్లి క్రాస్‌రోడ్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో మైదుకూరు నుంచి చెన్నూరువైపు వస్తున్న ఓ కారులో ఉన్న నలుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని అరెస్టు చేశారు.

నిందితుల్లో అనంతపురం జిల్లా ఖాజానగర్‌కు చెందిన మాగంటి నగేష్‌ అలియాస్‌ నగేశ్‌నాయుడు, అతని బంధువైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, నాగరాజుపాడు గ్రామానికి చెందిన పావుకూరి సుందర రామయ్య అలియాస్‌ సుందర్‌నాయుడు, కడప నగరం రామాంజనేయపురానికి చెందిన వాసం నవీన్‌రాజు, బుక్కే ప్రభాకర్‌ నాయక్‌ ఉన్నారు. వీరి వద్ద నుంచి ఓ కారు, రూ.84,000, సీఆర్‌పీఎఫ్‌ పేరుతో ఉన్న ఓ నకిలీ గుర్తింపుకార్డును సీజ్‌ చేశారు. కాగా.. నగేష్, సుందరరామయ్యలకు కారు ఉంది. దానిని బాడుగకు తీసుకున్నవారు కిరాయి కానీ, కారునుకానీ ఇవ్వకుండా తిప్పుకుంటుండడంతో వారిని బెదిరించాలని భావించారు.

మిగతా ఇద్దరు నిందితులతో కలసి ఇందుకోసం పథకం రచించారు. కారు బాడుగకు తీసుకున్నవారు తన బంధువులవడంతో వారి తరఫున ఉదయ్‌కుమార్‌ అడ్వాన్స్‌ కింద రూ.3 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించారు. దీంతో అతన్ని పట్టుకుంటే డబ్బు లాగవచ్చని భావించిన నిందితులు సీబీఐ అధికారులమంటూ బెదిరించి అతన్ని కారెక్కించి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం ఉదయ్‌కుమార్‌ ఇంటి వద్ద ఉన్న తమ కారును తీసుకోవడమే గాక, ఫోన్‌పే ద్వారా రూ.1,14,000ను తమ ఖాతాలకు జమ చేయించుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులను, పోలీసులను జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అభినందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top