చంద్రబాబు పాలనలో తీవ్ర సంక్షోభం.. ఫీడ్ ధరల పెరుగుదలతో సతమతం
పాతాళానికి పతనమైన రొయ్యల ధరలు
శరాఘాతమైన నాసిరకం సీడ్
సాగు భారంతో ఆక్వాపై రైతుల విముఖత
గత రెండేళ్లలో 50శాతం తగ్గిన సాగు విస్తీర్ణం
వచ్చే సీజన్‌లో సాగు విరామం యోచనలో రైతులు
రైతులను ఆదుకునేందుకు ముందుకురాని సర్కారు
ఫీడ్ ఫ్యాక్టరీల్లో ప్రభుత్వ పెద్దలకు వాటాలు
అందుకే ధరలు పెంచినా సర్కారు మౌనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ కూటమి పాలకుల దోపిడీకి ఇప్పటికే అన్ని రంగాలు కుప్పకూలిపోగా, తాజాగా ఆక్వా రంగమూ సంక్షోభంలో కూరుకుపోతోంది. నాసిరకం సీడ్, ఫీడ్ ధరల పెంపుతో కుదేలవుతోంది. ఆక్వా ఉత్పత్తుల అమ్మకాల నుంచి ఎగుమతుల వరకు అడుగడుగునా నష్టాలు వాటిల్లడంతో నిండా మునుగుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే సాగు చేయలేమని తెగేసి చెబుతున్నారు. వచ్చే సీజన్‌లో క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నారు. దీనికి చంద్రబాబు సర్కారు వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది.
ముడి సరుకుల ధరలు పెరుగుదల
చంద్రబాబు పాలనలో ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ఐదునెలల కాలలంలోనే రొయ్య ఫీడ్‌లో వినియోగించే ఫిష్ మీల్, సోయాబీన్, వేరుశనగ కేకు, ఫిష్ ఆయిల్, విటమిన్ ఫ్రీ మిక్స్, మినరల్ ఫ్రీ తదితర మెటీరియల్ ధరలు దాదాపు 50 నుంచి 70 శాతం పెరిగాయి. జనవరిలో ఫిష్ మీల్ కేజీ రూ.155 ఉంటే మే నెలలో కేజీ రూ.260కు పెరిగింది. ఐదు నెలల వ్యవధిలో ఫార్ములా కాస్ట్ దాదాపు రూ.17 పెరగడంతో ఫీడ్ యాజమాన్యాలు ధరలు పెంచాల్సి వచ్చిందని సమాచారం. టన్నుపై రూ.4 వేల నుంచి రూ.పదివేల వరకు ధరలు పెంచారు.
రొయ్యల ధరలు పతనం
ఇదిలా ఉంటే బాబు సర్కారు నిర్వాకం వల్ల రొయ్యల ధరలు భారీగా పతనమయ్యాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో రొయ్య రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఒక పక్క నాసిరకం సీడ్‌తోపాటు మరో పక్క పెరిగిన ఫీడ్ ధరలతో తల్లడిల్లుతున్న రైతులు చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో మండిపోతున్నారు. ఆక్వా సాగులో ఒక టన్ను రొయ్యలు ఉత్పత్తి చేయాలంటే రైతులు 90 రోజులు రొయ్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందులో సీడ్ కెమికల్స్, ఏరియేటర్స్, కరెంట్ బిల్లులు, జనరేటర్, ఫీడింగ్ కూలీలు తదితర పరికరాల కొనుగోళ్లు, లీజులతో కలిపి దాదాపు రెండెకరాల చెరువుకు రూ.2.60 లక్షల వరకు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ఉన్న రొయ్యల ధరలతో సరిచూసుకుంటే ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. రాష్ట్రం దోపిడీ
ఆక్వా ఫీడ్ తయారీలో వినియోగించే ముడిసరుకుల దిగుమతికి గతంలో సుంకాలు 30 శాతం ఉండగా, తాజాగా వాటిని ఐదు శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనధికారికంగా ఫీడ్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తిలో వాటాలు దండుకోవడంతో యాజమాన్యాలు అనివార్యంగా ధరలు పెంచేశాయి. అందుకే అప్సడా అనుమతి లేకుండా గత ఫిబ్రవరిలో ఫీడ్ ఫ్యాక్టరీలు ధరలు పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రైతుల వ్యతిరేకతతో యాజమాన్యాలపై ఒత్తిడి
అనూహ్యంగా పెరిగిన ఫీడ్ ధరల నేపథ్యంలో ఆక్వా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సర్కారు జంకింది. ఫీడ్ ధరలు తగ్గించాలని వ్యాపారులను ప్రాధేయపడుతోంది. పెరిగిన రా మెటీరియల్ ధరలు, ప్రభుత్వ పెద్దల దోపిడీతో తప్పని పరిస్థితుల్లో ధరలు పెంచిన వ్యాపారులు ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చారు. ధరలు తగ్గించలేమని తెగేసిచెప్పారు. అయినా ప్రభుత్వం ఒత్తిడి తెసేన్త ఫ్యాక్టరీలు నాసిరకం ఫీడ్‌ను మార్కెట్‌లోకి తెచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇప్పటికే నాసిరకం సీడ్‌తో సతమతమవుతున్న రైతులు ఫీడ్ కూడా నాణ్యత లేకపోతే తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది.
సాగుకు విముఖత
ఇదిలా ఉంటే బాబు పాలనలో వెంటాడుతున్న నష్టాలతో రైతులు ఆక్వా సాగు అంటేనే విముఖత చూపిస్తున్నారు. ఈ కారణంగానే గత రెండేళ్లలో 50 శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్టు సమాచారం. ఈ ఏడాది ఫీడ్ ధరలు తీవ్రంగా పెరిగి, రొయ్యల ధరలు పతనమైన నేపథ్యంలో వచ్చే సీజన్‌లో సాగుకు విరామం ప్రకటించే యోచనలో రైతులు ఉన్నారు. సర్కారు ఆదుకోకుంటే క్రాప్ హాలిడేనే శరణ్యమని తెగేసి చెబుతున్నట్టు తెలుస్తోంది.
రాయితీలతోనే మనుగడ
ఆక్వా రంగం మనుగడ సాగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఫీడ్ ఫ్యాక్టరీలను చేస్తున్న దోపిడీకి కళ్లెం వేయడంతోపాటు రా మెటీరియల్‌పై రాయితీలు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు ఇవ్వడం, ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు ఇస్తామని వాగ్దానం చేసింది. యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు విస్మరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


