సమగ్ర శిక్షలో సర్టిఫికేటుగాళ్లు | - | Sakshi
Sakshi News home page

సమగ్ర శిక్షలో సర్టిఫికేటుగాళ్లు

Jul 25 2026 12:05 AM | Updated on Jul 25 2026 12:05 AM

అంతులేని నిర్లక్ష్యం

పలువురు సైట్‌ ఇంజినీర్లపై ఆరోపణలు

విచారణ పేరుతో చర్యల్లో జాప్యం

ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో

వేతనాల రూపంలో ప్రజాధనం స్వాహా

ఉదయగిరి: నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయ పరిధిలో పలువురు ఉద్యోగులు ఫేక్‌ విద్యార్హత పత్రాలను సమర్పించి విధులను నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేయగా, విచారణ పేరుతో వారిని కాపాడుతూ వేతనాల రూపంలో రూ.కోట్ల మేర స్వాహా చేస్తున్నారని తెలుస్తోంది.

వివాదాల ఛట్రంలో..

జిల్లా సమగ్ర శిక్షలో 14 మంది సైట్‌ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎనిమిది మంది నకిలీ విదార్హత పత్రాలతో విధుల్లో చేరారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల్లో చేరిన వీరిలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. వివిధ పనులను చేయకుండానే రూ.లక్షల్లో నిధులను మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై విజి లెన్స్‌ విచారణ ప్రస్తుతం జరుగుతోంది. కార్యాలయంలో జేటీఓగా విధులు నిర్వర్తిస్తున్న అహ్మద్‌ బాషా (సైట్‌ ఇంజినీర్‌) నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో చేరారని, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌కు నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబర్‌లో ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పంజాబ్‌లో పొందిన బీటెక్‌ సర్టిఫికెట్‌లో ఇక్కడ పనిచేస్తున్నారని, అయితే అది నకిలీదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అపాయింట్మెంట్‌ ఆర్డర్‌ సైతం నిబంధనల మేరకు లేదని తెలిపారు.

మరికొన్ని ఉదాహరణలు..

● సమగ్ర శిక్షలో సైట్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్న రాయదుర్గం మహేశ్వరి (ప్రస్తుతం మానేశారు), దావులూరి రవి, అహ్మద్‌ బాషా, వేలూరి బలరామ్‌, మస్తానయ్య.. తప్పుడు విద్యార్హత పత్రాలతో డిప్లొమా ఇంజినీరింగ్‌తో ఉద్యోగాల్లో చేరారనే ఆరోపణలున్నాయి. పరిశీలన నిమిత్తం సర్టిఫికెట్లను వీరు చదువుకున్న నెల్లూరు పాలిటెక్నిక్‌ కళాశాలకు 2021లో అప్పటి ఏపీసీ పంపారు. అయితే అక్కడ్నుంచీ నేటికీ సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ ఉదంతంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి.

ఆరోపణలను ఎదుర్కొంటున్న సైట్‌ ఇంజినీర్లపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ఉంటే ఈ కుంభకోణం జరిగి ఉండేది కాదు. సమగ్ర శిక్షలో తవ్వేకొద్దీ అనేక అక్రమాలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా, చిన్నపాటి చర్యలకే పరిమితం కావడంపై దుమారం రేగుతోంది. కాగా ఈ అంశమై డీఈఓ బాలజీరావును సంప్రదించగా, ఏపీసీగా తాను ఇంకా బాధ్యతలను చేపట్టలేదని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement