నెల్లూరు(టౌన్): కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని పలు విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ శుక్రవారం వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన బంద్ విజయవంతమైంది. నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారన్నారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వారిపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతోపాటు విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ షరీఫ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి షారుఖ్, ఏవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మున్నా, డీవైఎఫ్‌ఐ నాయకుడు రమణ, వివిధ సంఘాలకు చెందిన శివం వర్మ, యస్దానీ, సొహైల్, సర్దార్, జీవన్, కోటి, గోవర్ధన్, మున్నా, ధీరజ్, ఆదిత్య, త్రివిక్రమ్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ సీనియర్ నేత
పముజుల కన్నుమూత
నెల్లూరు (వీఆర్సీసెంటర్): సీపీఐ జిల్లా కార్య దర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత, చేనేత కార్మిక సంఘ రాష్ట్ర నేత పముజుల దశరథరామయ్య (94) వయోభారం, అనారోగ్యంతో కన్నుమూశారు. అస్వస్థతకు శుక్రవారం గురికావడంతో ఆయన్ను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్‌మోపూరుకు చెందిన ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. సీపీఐలో 70 ఏళ్లుగా ఉంటూ పార్టీ కోసం విశేష కృషి చేశారు. సౌత్‌మోపూరుకు 40 ఏళ్ల పాటు సర్పంచ్‌గా, నెల్లూరు రూరల్ ఎంపీపీగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా పలు పదవుల్లో కొనసాగారు. కాగా ఈయన మృతిపై సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ, పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, నేతలు హరినాథ్‌రెడ్డి, జంగాల అజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి తదితరులు సంతాపం తెలియజేశారు.


