● సర్‌తో సమగ్ర ప్రక్షాళన
● అందుబాటులో అధునాతన టెక్నాలజీ
● ఏమీ కాదనుకుంటే పొరపాటే
● చట్టపరమైన చర్యలకు అవకాశం
ఉదయగిరి: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు దుర్వినియోగానికి గురవుతున్న వైనంపై సర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లుండటం.. ఎన్నికల సమయంలో ఇలా వేయడాన్ని నివారించాలనే లక్ష్యంతో స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది.
తీవ్ర ప్రభావం
నగరాల్లో స్థిరపడిన నిపుణులు, ఉద్యోగులు.. తాత, ముత్తాతల నాటి సెంటిమెంట్ పేరుతో సొంతూళ్లలో ఒక ఓటు ఉంచుకుంటూ.. నివాసం ఉంటున్న చోట మరో దాన్ని కొనసాగించుకుంటున్నారు. అక్కడా.. ఇక్కడా రెండు ప్రాంతాల్లోనూ వేసి గెలుపోటములను శాసిస్తున్నారు. తమ బంధువులో లేదో అనుచరులో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీలో ఉంటే ఓటు హక్కును ఉపయోగించుకుంటూ ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును మార్చేస్తున్నారు.
నిమిషాల్లో పసిగట్టేస్తూ..
జిల్లాలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పారదర్శకమైన పోలింగ్‌ను నిర్వహించడమే లక్ష్యంగా సర్ ప్రక్రియను చేపట్టారు. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా ఒకే వ్యక్తి వివరాలతో రెండు ఓట్లుంటే ఈ సిస్టమ్ నిమిషాల్లోనే పసిగట్టేస్తుంది. గతంలో మాదిరిగా రెండు చోట్లా అంటే కుదరదు. కచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో రద్దు చేసుకోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.


