టీడీపీ పెద్దల ‘స్కిల్‌’ నిర్వాకాలు బహిర్గతం

APSSDC Scam: TDP Leaders Increases Contracts Estimation - Sakshi

అంచనాలు రూ.3,300 కోట్లకు పెంచేసి కాంట్రాక్టు ఖరారు  

ప్రభుత్వ వాటా కింద రూ.370 కోట్లు బినామీల జేబుల్లోకి 

సీమెన్స్‌కు ఇచ్చింది రూ.56 కోట్ల పనులే

ఆ కాంట్రాక్టుతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ లేఖ

‘యువత నైపుణ్యాలను పెంపొందించి మెరుగైన ఉపాధి కల్పనకే స్కిల్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చాం’ 
– టీడీపీ పెద్దలు చెబుతున్న మాట.

‘ఏపీఎస్‌ఎస్‌డీసీకి మేం రూ.56 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే సరఫరా చేశాం.  రూ.3,300 కోట్ల విలువైన ప్రాజెక్టు అని చెబుతున్న దానితో మాకు ఎలాంటి సంబంధం లేదు’  – ఏపీఎస్‌ఎస్‌డీసీకి తాజాగా సీమెన్స్‌ కంపెనీ లేఖ

సాక్షి, అమరావతి: టీడీపీ సర్కారు అవినీతి నిర్వాకాలకు ఇది తిరుగులేని నిదర్శనం. ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో మతలబు ఇందులో స్పష్టమవుతోంది. సీమెన్స్‌ కంపెనీ పేరు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి ప్రభుత్వం చెల్లించాల్సిన పది శాతం నిధుల పేరిట రూ.371 కోట్లను టీడీపీ పెద్దలు దారి మళ్లించారు. అందులో రూ.241 కోట్లు కొల్లగొట్టేశారు. సీమెన్స్‌ కంపెనీ ఇటీవల ఏపీఎస్‌ఎస్‌డీసీకి రాసిన లేఖతో ఈ బండారం బట్టబయలైంది. 

‘సీమెన్స్‌’ పేరుతో అంచనాలు పెంపు  
గత సర్కారు హయాంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ రూ.3,300 కోట్లకు సీమెన్స్‌ కంపెనీ పేరుతో చేసుకున్న ఒప్పందం వెనుక లోగుట్టు వీడింది. నిబంధనల ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులను ప్రభుత్వం చెల్లించాలి. ప్రాజెక్టు వ్యయాన్ని ఎంత పెంచితే ఆమేరకు ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచి చూపాలంటే ఓ అంతర్జాతీయ కంపెనీ కావాలి.

అందుకే సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలతో కలిసి ప్రాజెక్టు చేపడుతున్నామంటూ రూ.3,300 కోట్లకు టీడీపీ హయాంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం చేసుకుంది. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కలసి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. అయితే ఆ రెండు కంపెనీలు ఒక్క రూపాయి కూడా వెచ్చించ లేదు. గత ప్రభుత్వం మాత్రం తన వాటాగా జీఎస్టీతో సహా రూ.370 కోట్లు చెల్లించేసింది. ఇందులో సీమెన్స్‌ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్‌వేర్, మరి కొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు.

రూ.241 కోట్లను నకిలీ ఇన్‌వాయిస్‌తో షెల్‌ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్‌టెక్‌ ఖాతాలోకి మళ్లించారు. ఇలా టీడీపీ పెద్దలు రూ.241 కోట్లు జేబులో వేసుకున్నారు. అసలు సీమెన్స్‌ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలియదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్‌ బోస్‌ అలియాస్‌ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్‌ టెక్‌తో కలిసి కథ నడిపించారు.

ప్రాజెక్టుతో సంబంధం లేదన్న సీమెన్స్‌ 
టీడీపీ హయాంలో ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం చేసుకున్న సుమన్‌ బోస్‌ అలియాస్‌ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ వ్యవహారాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ స్పష్టం చేసింది. ఈమేరకు సీమెన్స్‌ కంపెనీ ఇటీవల ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఓ లేఖ రాసింది. సుమన్‌ బోస్‌ తన పరిధిని అతిక్రమించి ఏపీఎస్‌ఎస్‌డీసీతో చేసుకున్న ఒప్పందానికి తమ కంపెనీ ఏ విధంగానూ బాధ్యత వహించదని లేఖలో తేల్చి చెప్పింది.

అసలు ఆ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా ఎలా లెక్కించారో కూడా తమకు తెలియదని, ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంది. సుమన్‌ బోస్‌ ఏపీఎస్‌ఎస్‌డీసీతో జరిపిన లావాదేవీలు, ఈమెయిల్‌ సందేశాల గురించి సీమెన్స్‌ కంపెనీకి కనీస సమాచారం కూడా లేదని తెలిపింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే డిజైన్‌టెక్‌ కంపెనీ తమకు రూ.56 కోట్లు చెల్లించిందని వెల్లడించింది.

ఆమేరకు తాము లైసెన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ను సరఫరా చేయడంతోపాటు ఇతర సేవలు అందించామని వివరించింది. అంతటితో తమ పని ముగిసిందని, అంతేగానీ రూ.3,300 కోట్ల ప్రాజెక్టుకు తమ బాధ్యత లేదని సీమెన్స్‌ స్పష్టం చేసింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టు పేరుతో టీడీపీ పెద్దలు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు తద్వారా వెల్లడవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top