1 నుంచి 7వ తరగతి వరకు అన్నీ నింపాల్సిందే
కొన్ని తరగతులు చదవని వారికి అప్‌డేట్ కష్టాలు
తప్పనిసరి నమోదు విధానం రద్దుచేయాలని డిమాండ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సర్వీస్ కమిషన్ చుక్కలు చూపిస్తోంది. ఓటీపీఆర్ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్)లో చేసిన తాజా మార్పులు వారి పాలిట సమస్యగా మారాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం ప్రభుత్వం జిల్లాల పునర్ విభజనతో పాటు మల్టీ జోనల్ విధానం తీసుకొచ్చింది. మారిన పరిస్థితుల రీత్యా అభ్యర్థులు స్థానికతను నిర్ధారించేందుకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ క్రమంలో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యాభ్యాసం వరుస క్రమంలో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
వాస్తవానికి రాష్ట్ర విద్యావిధానంలో ప్రతి తరగతి తప్పనిసరిగా చదవాలనే నిబంధన లేకపోవడంతో గతంలో కొంతమంది విద్యార్థులను వారి ప్రతిభ, వయసు ఆధారంగా కొన్ని తరగతులు చదవకుండానే నేరుగా మూడు, నాలుగు లేదా ఐదో తరగతుల్లో చేర్పించారు. దీంతో వారు కొన్ని తరగతులు చదవకుండానే డిగ్రీ, పీజీలు కూడా పూర్తిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓటీపీఆర్ నమోదులో మాత్రం ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో తప్పనిసరిగా నమోదు చేస్తేనే అప్‌డేట్ అయ్యేలా మార్పులు చేశారు. దీంతో ఒకటి నుంచి ఏడో తరగతి మధ్యలో ఒకటి రెండు తరగతులు చదవకుండా నేరుగా పైతరగతి చదివినా.. అలాంటి అభ్యర్థులు తమ ఓటీపీఆర్ వివరాలు నమోదు చేస్తే అప్‌డేట్ కావడం లేదు.
ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో ‘టైప్ ఆఫ్ స్టడీ, జిల్లా, మండలం, గ్రామం/పట్టణం/నగరం, పాసైన సంవత్సరం, పాఠశాల పేరు’ వివరాలు నమోదు చేస్తేనే వెబ్‌సైట్‌లో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం కల్పించారు. దీంతో మధ్యలో కొన్ని తరగతులు చదవలేని వారి వివరాలు తీసుకోవడంలేదు. అలాగే, 7వ తరగతి వరకు చదవకుండా, నేరుగా ఓపెన్ స్కూలింగ్ విధానంలో పది, ఇంటర్, దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఓటీపీఆర్ అప్‌డేట్ అవడం లేదు. ఈ విధానం మార్చాలని, లేకుంటే వేలాది మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు, ప్రతిభతో పైతరగతులు చదివిన అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


