breaking news
One Time Profile Registration
-
ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ‘ఓటీపీఆర్’ కష్టాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సర్వీస్ కమిషన్ చుక్కలు చూపిస్తోంది. ఓటీపీఆర్ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్)లో చేసిన తాజా మార్పులు వారి పాలిట సమస్యగా మారాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం ప్రభుత్వం జిల్లాల పునర్ విభజనతో పాటు మల్టీ జోనల్ విధానం తీసుకొచ్చింది. మారిన పరిస్థితుల రీత్యా అభ్యర్థులు స్థానికతను నిర్ధారించేందుకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ క్రమంలో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ విద్యాభ్యాసం వరుస క్రమంలో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో నమోదు చేయాలి. వాస్తవానికి రాష్ట్ర విద్యావిధానంలో ప్రతి తరగతి తప్పనిసరిగా చదవాలనే నిబంధన లేకపోవడంతో గతంలో కొంతమంది విద్యార్థులను వారి ప్రతిభ, వయసు ఆధారంగా కొన్ని తరగతులు చదవకుండానే నేరుగా మూడు, నాలుగు లేదా ఐదో తరగతుల్లో చేర్పించారు. దీంతో వారు కొన్ని తరగతులు చదవకుండానే డిగ్రీ, పీజీలు కూడా పూర్తిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓటీపీఆర్ నమోదులో మాత్రం ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో తప్పనిసరిగా నమోదు చేస్తేనే అప్డేట్ అయ్యేలా మార్పులు చేశారు. దీంతో ఒకటి నుంచి ఏడో తరగతి మధ్యలో ఒకటి రెండు తరగతులు చదవకుండా నేరుగా పైతరగతి చదివినా.. అలాంటి అభ్యర్థులు తమ ఓటీపీఆర్ వివరాలు నమోదు చేస్తే అప్డేట్ కావడం లేదు.ఒకటి నుంచి 7వ తరగతి వరకు వరుస క్రమంలో ‘టైప్ ఆఫ్ స్టడీ, జిల్లా, మండలం, గ్రామం/పట్టణం/నగరం, పాసైన సంవత్సరం, పాఠశాల పేరు’ వివరాలు నమోదు చేస్తేనే వెబ్సైట్లో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం కల్పించారు. దీంతో మధ్యలో కొన్ని తరగతులు చదవలేని వారి వివరాలు తీసుకోవడంలేదు. అలాగే, 7వ తరగతి వరకు చదవకుండా, నేరుగా ఓపెన్ స్కూలింగ్ విధానంలో పది, ఇంటర్, దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఓటీపీఆర్ అప్డేట్ అవడం లేదు. ఈ విధానం మార్చాలని, లేకుంటే వేలాది మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు, ప్రతిభతో పైతరగతులు చదివిన అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఏపీపీఎస్సీ కొత్త వెబ్సైట్
వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సదుపాయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఉద్యోగార్థులు, ఉద్యోగులకు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. వీరు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునివివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త వెబ్సైట్ (www.psc.ap.gov.in)ను శుక్రవారం ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయ్ భాస్కర్, సెక్రటరీ ఎ.గిరిధర్ ప్రారంభించారు. ఓటీపీఆర్ ద్వారా అభ్యర్థుల దరఖాస్తు ల నుంచి పరీక్ష నిర్వహణ వరకు ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లువారు తెలిపారు. మొదట ప్రభుత్వ ఉద్యోగులకు: ఓటీపీఆర్ సదుపాయాన్ని తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చారు. పలు శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ డిపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు ఓటీపీఆర్ ద్వారా తమ ఉద్యోగ వివరాలు నమోదు చేసుకోవచ్చు. వచ్చే నెల 9 నుంచి 14వరకు ఆన్లైన్లో నిర్వహించే డిపార్ట్మెంట్ టెస్ట్ ఈ విధానంలోనే ప్రారంభిస్తున్నట్లు కమిషన్ చైర్మన్, సెక్రటరీ తెలిపారు. మరో నెలలో నోటిఫికేషన్: రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు కమిషన్ సెక్రటరీ తెలిపారు. తొలి నోటిఫికేషన్‌ను మరో నెలలోపు విడుదల చేసే అవకాశముందన్నారు. కాగా అభ్యర్థులు కొత్త వెబ్‌సైట్‌లోని వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేసుకోవాలి.వీటిని బట్టి యునిక్ ఐడీ(గుర్తింపు సంఖ్య) కేటాయిస్తారు.


