
ఏపీఎమ్మార్‌సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ
ఈపీసీ పద్ధతిలో 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశం
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులకు రూ.4,150 కోట్ల అంచనా వ్యయంతో సోమవారం ఏపీఎమ్మార్‌సీఎల్(ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో 30 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది. బిడ్ దాఖలుకు సెప్టెంబర్ 12వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఫ్రీబిడ్ సమావేశాన్ని ఈ నెల 18న ఎపీఎమ్మార్‌సీఎల్ కార్యాలయంలో నిర్వహించనుంది.
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశ పనులను 38.40 కి.మీ. పొడవున వయాడక్ట్(ఇందులో 4.33 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్ లేన్ ఫ్లైఓవర్, మోట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో రైల్వేస్టేషన్‌తో పాటు 32 స్టేషన్‌లను నిర్మించేలా పనులు చేపట్టింది. ఈ పనులను రెండు కారిడార్‌లుగా చేపట్టింది. మొదటి కారిడార్‌ను 25.9 కి.మీ పొడవున పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు, రెండో కారిడార్‌ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిమీల పొడవున మెట్రో రైల్ వయాడక్ట్, స్టేషన్‌లు నిర్మించనుంది.
మెట్రో తొలిదశ కన్సల్టెన్సీలకు రూ.401.28 కోట్లు
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనుల పర్యవేక్షణకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ కన్సల్టెన్సీలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.401.28 కోట్లు చెల్లించనుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ కన్సల్టెన్సీ బాధ్యతలను సిస్ట్రా సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.212.40 కోట్లు చెల్లించనుంది. అలాగే, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశకు కన్సల్టెన్సీ బాధ్యతలను టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్‌ఏ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థకు నాలుగేళ్లలో కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.188.88 కోట్లు చెల్లించనుంది.
ఇక విశాఖపట్నంలో తొలిదశ కింద మూడు కారిడార్‌లలో 46.23 కి.మీ.ల పొడవున వయాడక్ట్ (ఇందులో 20.16 కి.మీ. పొడవున డబుల్ డెకర్ ఫోర్‌లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), 42 స్టేషన్లు నిర్మించేలా చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 24న రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వనించింది. ఫీజుకింద రూ.212.40 కోట్లను చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ సిస్ట్రా సంస్థ బిడ్ దాఖలు చేసింది.
మరోవైపు.. విజయవాడలో తొలిదశ కింద 38.40 కిమీ పొడవున వయాడక్ట్ (ఇందులో 4.33 కిమీ డబుల్ డెకర్ ఫోర్‌లేన్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్), ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌తోపాటు మరో 32 స్టేషన్‌లు నిర్మించేలా చేపట్టే ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం, పనులు పర్యవేక్షించేందుకు కన్సల్టెన్సీ కోసం ఏప్రిల్ 30న ఏపీఎమ్మార్‌సీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.188.88 కోట్లు చెల్లిస్తే కన్సల్టెన్సీగా సేవలు అందించేందుకు సిద్ధమంటూ టెక్నికా వై ప్రొయెక్టాస్ ఎస్‌ఏ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు టెండర్లను ఏపీఎమ్మార్‌సీఎల్ ఆమోదించి, కన్సల్టెన్సీలుగా ఆ సంస్థలను ఎంపిక చేసింది. కన్సల్టెన్సీ బాధ్యతలను ఆ సంస్థలకు అప్పగిస్తూ వాటితో ఒప్పందం చేసుకుంది.