అధ్యక్షుడిగా కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జంషీద్
ఉద్యోగుల పొట్టగొడుతూ ఉద్ధరించినట్లు ప్రచారమా?
ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం
సాక్షి, అమరావతి: సమైక్యంగా ఉంటూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఏపీ వైఎస్సార్‌టీఏ నూతన కార్యవర్గానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయి కమిటీల నియామకం త్వరితగతిన పూర్తిచేసి సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం ఏపీ వైఎస్సార్‌టీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తాడేపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
రాష్ట్రం అంతటి నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. దీపావళికి ముందు ఇచ్చిన పెండింగ్ డీఏ కూడా మోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒక్కటి ఇచ్చి, ఆ ఎరియర్స్‌ను కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామంటూ దెబ్బకొట్టారు.
పీఆర్సీ, ఐఆర్, రూ.34 వేల కోట్ల బకాయిల గురించి ప్రస్తావనే లేదు. దీంతోనే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది’’ అని ధ్వజమెత్తారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఆర్నెల్లకు ఒక డీఏ చొప్పున 10 డీఏలు ఇవ్వడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డీఏ కూడా ఇచ్చారని అన్నారు.
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి నప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలున్నాయని చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారని పేర్కొన్నారు. వాటిని దఫదఫాలుగా చెల్లిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లు పొందిన చంద్రబాబు, గెలిచాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
బకాయిలు చెల్లిస్తానని చెప్పి.. వాటిని మరో రూ.12 వేల కోట్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని... ఇది మోసం కాదా? అని నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను 2027–28లో 12 వాయిదాల్లో ఇస్తానని చెప్పడం వేధించడమేనని అన్నారు.
ఏపీ వైఎస్సార్‌టీఏ నూతన రాష్ట్ర కార్యవర్గం
ఏపీ వైఎస్సార్‌టీఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన కేశవరపు జాలిరెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంషీద్ (శ్రీ సత్యసాయి జిల్లా), రాష్ట్ర కోశాధికారిగా ప్రేమ్‌సాగర్ (గుంటూరు)ను ఎన్నుకున్నారు.


