
రైతు మహిళపై కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు దాష్టీకం
బూతులు తిడుతూ చేయి చేసుకున్న వైనం
పొలం వదిలేయాలని రైతు కుటుంబానికి హుకుం
రియల్ ఎస్టేట్ వ్యాపారికి మేలు చేసేందుకు బరితెగింపు
మీడియా ఎదుట బాధితులు కన్నీటి పర్యంతం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘లం.. ముం.. చంపేస్తా నిన్ను. చెప్పిన మాట విని ఆ పొలం వదిలేయండి. మీ వల్ల ఊళ్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. లేదంటే వాళ్లు చంపేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనే చంపేస్తా’ అంటూ కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు ఓ మహిళా రైతుపై చేయి చేసుకుని రెచ్చిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కేజే రెడ్డికి వకాల్తా పుచ్చుకుని బరితెగించారు. సభ్య సమాజం తల దించుకునేలా బాధిత కుటుంబాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడు. సంఘటన వివరాలను బాధితులు మంగళవారం రాత్రి కర్నూలులో మీడియాకు వివరించారు.
కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన నాగన్నకు 12.84 ఎకరాల భూమి ఉంది. అయితే ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో నిషేధిత భూముల జాబితాలో పెట్టారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేజే రెడ్డి ఈ భూములపై కన్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల ఇలాంటి భూములున్న వారిని బెదిరించి ఇప్పటికే 50 ఎకరాల మేర ఆక్రమించుకున్నారు. కాళ్లావేళ్లా పడిన వారికి ఎకరాకు రూ.50–60 వేలు ఇచ్చారు. ఇలా అప్పనంగా భూములు ఇచ్చేందుకు నాగన్న కుటుంబం నిరాకరించింది. దీంతో పోలీసులను అడ్డు పెట్టుకుని వారిపై తప్పుడు కేసులు పెట్టించారు. నాగన్న కుమారులు ఇద్దరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు.
ఈ క్రమంలో వారు ఎస్పీకి అర్జీ పెట్టుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలిసి.. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు, ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయ.. నాగన్న, ఆయన భార్య, ఇద్దరు కుమారులను మంగళవారం రాత్రి కర్నూలులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ‘మాపైనే ఫిర్యాదు చేస్తారా.. మీకెంత ధైర్యం.. ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు’ అంటూ తీవ్రంగా బెదిరించారు.
60 ఏళ్లుగా ఈ పొలం చేస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్లుండి కేజేరెడ్డికి ఇచ్చేయాలని చెప్పడం న్యాయం కాదని నాగన్న భార్య వాపోయారు. దీంతో సీఐ ఆమెపై ఊగిపోతూ బూతులు తిట్టారు. లం.. ముం.. చంపేస్తానంటూ ఊగిపోయారు. చెంప దెబ్బ కూడా కొట్టారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దౌర్జన్యాన్ని నాగన్న కుటుంబం మీడియాకు వివరించింది. తమకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ, డీఐజీని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, పోలీసులకు భయపడి కొంత కాలంగా ఊళ్లో ఉండటం లేదని, డోన్ సమీపంలోని కొచ్చెరువులో ఉంటున్నామని తెలిపారు.