మిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీ ముందు ఆందోళన చేస్తున్న హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు
గో మాంసం సీజ్ ఓ బూటకం.. ఎక్కడికి తరలించేశారు
ప్రభుత్వం అద్భుతంగా నటిస్తోంది
పశుసంవర్ధక శాఖ అధికారి నిర్ధారించినా ప్రభుత్వ పెద్దల మీనమేషాలు
హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధుల ధ్వజం
కోల్డ్ స్టోరేజ్ ఎదుట ఆందోళన
తగరపువలస: ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీలో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ నుంచి రెండు వారాల క్రితం సీజ్ చేసిన 1.89 లక్షల కిలోల గో మాంసంపై చంద్రబాబుతోపాటు ఆయన సర్కారు అద్భుతంగా నటిస్తోందని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు దుయ్యబట్టారు. కోల్డ్ స్టోరేజ్ ముందు విశ్వహిందూ పరిషత్, సమరసత అభియాన్, ప్రాంత మందిర, అర్చక పురోహిత్ సురక్ష తదితర హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు సోమవారం ఆందోళన చేపట్టారు.
గో మాంసం సీజ్ చేయడం ఒక బూటకమన్నారు. హిందువులు ఆవులను గోమాతగా పూజిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలోని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ అతని అనుచరుడు తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా లక్షల గోవులను వధించి విదేశాలకు మాంసం అమ్ముకుంటున్నారని విమర్శించారు. గో మాంసం సీజ్ చేయడం అంటే తెరచుకునే తాళాలు వేయడం కాదని ఎద్దేవా చేశారు. పశు సంవర్థకశాఖ, పోలీసులను బలిపశువులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలతో అడుకుంటోందని ధ్వజమెత్తారు. కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, డిప్యూటీ సీఎం పవన్, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
సీఐఐ సదస్సు పేరుతో రాష్ట్ర కేబినెట్ విశాఖకు తరలివచ్చినా హిందువుల ఆందోళనను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని దేశంలోని ఇతర హిందూ ధార్మిక సంస్థలతో కలిసి ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అధికారపక్ష ఎమ్మెల్యే అనుచరునికి చెందిన ఈ కోల్డ్ స్టోరేజ్ వల్ల పక్కనే ఉన్న సింహాచలంలోని గోవులకూ ముప్పు పొంచి ఉందన్నారు. సీజ్ అంశంపై నిజానిజాలు తేలేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గో మాంసం రవాణా చేస్తున్న సుబ్రహ్మణ్య గుప్తాను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కోల్డ్ స్టోరేజ్ వద్ద నాటకీయ పరిణామాలు
తమను కోల్డ్ స్టోరేజ్ లోపలికి పంపిస్తే సీజ్ చేసిన గో మాంసం ఉందా లేదా పరిశీలిస్తామని గంటన్నర పాటు ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆందోళన చేస్తే చివరకు ఐదుగురిని మాత్రమే సెల్‌ఫోన్‌లు లేకుండా లోపలికి అనుమతించారు. దీంతో పరిశీలించి వచి్చన వారు మాట్లాడుతూ సీజ్ చేసిన గో మాంసం ఎక్కడికో తరలించినట్టు అనుమానం వ్యక్తం చేశారు. సీజ్ చేసినట్లుగా చెప్పుకొస్తున్న మాంసానికి అసలు లక్క వంటి సీలు లేక కేవలం ఒక్క తాళం మాత్రమే వేసినట్టు ఉందన్నారు. కార్యక్రమంలో ధార్మిక సంస్థల రాష్ట్ర నాయకులు పూడిపెద్ది శర్మ, మీసాల రవీంద్ర, జిల్లా నాయకులు గాడు వెంకట నారాయణ, పీవీవీ ప్రసాదరావు, ఫణీంద్ర, ఎం.రామకృష్ణ, బి.సుబ్రహ్మణ్యం, శీరపు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


