
ఉద్యోగులు, పెన్షనర్ల ఇబ్బందులను పట్టించుకోరా?
దసరా కానుకగా బకాయిలు, కనీసం డీఏలనైనా ఇవ్వాలి
ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలోని రెవిన్యూ భవన్‌లో ఆదివారం జరిగిన జేఏసీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంవల్ల రిటైరైన తర్వాత గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్ మెంట్ మొత్తాలు తీసుకోకుండానే చాలామంది మరణిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈహెచ్‌ఎస్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, సరెండర్ లీవ్ డబ్బులు కూడా విడుదల కావడంలేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తంచేశారు. దసరా పండుగ కానుకగా కనీసం డీఏలు, పెన్షనర్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ఇప్పటివరకు జీఓ జారీచేయకపోవడం సరికాదన్నారు.
ఉద్యమాలకు వెనుకాడం..
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ.. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల పెంపు, వారికి ప్రభుత్వ పథకాల వర్తింపు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. బకాయిలు, డీఏలు, పీఆర్సీ నియామకం, పదోన్నతులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక నవంబరు 30లోపు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న సంఘాలు రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలు పూర్తిచేసి, జిల్లా పర్యటనలు నిర్వహించి, స్థానిక కమిటీల్లో ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే, భవిష్యత్తులో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ ఇచ్చే పిలుపులకు సంఘాలు సిద్ధంగా ఉండాలని బొప్పరాజు కోరారు.