
సాక్షి, అమరావతి: దళిత యువతి అనుమానాస్పద మృతి కేసులో గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులపై హైకోర్టు మండిపడింది. తనే భవనం పైనుంచి దూకానంటూ మృతురాలే వాంగ్మూలం ఇచ్చినట్లు అఫిడవిట్‌లో పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆ యువతి మరణించిన నేపథ్యంలో, మరి ఆమె వాంగ్మూలం ఎలా నమోదు చేశారంటూ పోలీసులను ప్రశ్నించింది. పోలీసులు కొత్త కథ బాగా అల్లారంటూ వ్యాఖ్యానించింది. దీనిని బట్టి పోలీసుల దర్యాప్తు ఏ తీరులో సాగిందో అర్థమవుతోందని తెలిపింది.
రాష్ట్రంలో పోలీసులకు కోర్టులన్నా.. కోర్టు ఉత్తర్వులన్నా.. కోర్టు సిబ్బంది అన్నా ఏ మాత్రం గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దళిత యువతి మృతి ఘటనను ఆత్మహత్యగా పేర్కొంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించి, దానిపై వాదనలు వినిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా బుడంపాడులోని సెయింట్ మేరీస్ ఇంనీరింగ్ కాలేజీలో అమృతలూరు మండలం, గోపాయపాళెంకు చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్య పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ 2017 ఫిబ్రవరి 28న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన కుమార్తెది హత్య అని, దీనికి కాలేజీ యాజమాన్యంతో పాటు రూంమేట్స్ కారణమంటూ మృతురాలి తల్లి జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేసి చేతులుదులుపుకున్నారు. దీంతో జయలక్ష్మి 2017 జూలై 6న హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్‌లో కోరారు.
హైకోర్టు అసహనం..
ఈ ఘటన విచారణ సందర్భంగా సెప్టెంబర్‌లో జస్టిస్ బట్టు దేవానంద్ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది దర్యాప్తు పూర్తయిందని చెప్పడంతో అయితే చార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదు, చేయవద్దని మేము చెప్పలేదుకదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.