అది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం 

AP High Court on merger of schools rationalization of teachers - Sakshi

పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై హైకోర్టు 

అందులో జోక్యం చేసుకోలేం 

మేమున్నది ప్రభుత్వాన్ని నడపడానికి కాదు.. 

తదుపరి విచారణ సెప్టెంబర్‌ 13కి వాయిదా 

సాక్షి, అమరావతి: పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అందులో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలమని హైకోర్టు తేల్చి చెప్పింది. అధికరణ 226 కింద తాము ప్రభుత్వాన్ని నడపడంలేదని స్పష్టం చేసింది. తామున్నది ప్రభుత్వాలను నడిపేందుకు కాదని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 13కి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవోలను సవాలు చేస్తూ ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ డి.రమేశ్‌చంద్ర సింహగిరి పట్నాయక్‌ తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంతో పాటు ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలు మంగళవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కొందరు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది అప్పారి సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందన్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు.

ఈ వ్యాజ్యాలన్నింటిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని చెప్పారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది (పాఠశాల విద్య) ఎల్వీఎస్‌ నాగరాజు స్పందిస్తూ, తాజా వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని కోరారు. ఏ వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయలేదో వాటన్నింటిలో కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top