Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌కు టెస్లా!? 

Published Fri, Apr 12 2024 12:00 PM

AP Govt invites Tesla to set up unit in Andhra Pradesh - Sakshi

ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం

స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానం

ఎన్నికల తర్వాత రాష్ట్రానికి టెస్లా బృందాలు?

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యుఫ్యాక్చర్‌ యూనిట్‌ నెలకొల్పాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ టెస్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెస్లా యాజమాన్యానికి ఇప్పటికే రెండు ఈ-మెయిల్స్ పంపామని, స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టెస్లా కంపెనీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని తెలియజేసింది. ఒకవేళ టెస్లా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా సహకారం అందించనున్నట్లు భరోసా ఇచ్చింది.

అనంతపురం జిల్లాలో..
“రాష్ట్రాన్ని సందర్శించి, వారి యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించాలని టెస్లాను ఆహ్వానించాం. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని, వారు తమ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కావాల్సిన చోట భూమిని ఇస్తామని చెప్పాం. చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో ఉన్నందున అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్‌ సమీపంలో భూములను ప్రతిపాదించాం. ఇది బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అలాగే చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండాలనుకుంటే నాయుడుపేట, శ్రీ సిటీ సమీపంలో భూములు పరిశీలించవచ్చు" అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నట్లుగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉటంకించింది.

ఎన్నికల తర్వాత..
టెస్లా బృందం రాష్ట్రానికి వచ్చి వారి అవసరాలకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే వారికి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ పార్టీల నుంచి భూమిని కొనుగోలు చేసైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారి వివరించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెస్లా బృందాలు ఆంధ్రప్రదేశ్‌కి వస్తాయన్నారు. ప్లాంట్ నిర్మాణానికి 2,500 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. మస్క్ ప్రధానిని కలుస్తున్నప్పటికీ ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్చల ఫలితం బయటకు రాదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి, 2021, 2022 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ను ఆహ్వానించింది. ఇప్పుడు మరోసారి మస్క్ భారతదేశ పర్యటన గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement