Andhra Pradesh Govt Has Spent 685 Crore On Corona Patients Treatment - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ రోగుల చికిత్సకే రూ.685 కోట్ల వ్యయం

Published Fri, Sep 17 2021 3:41 PM

AP Govt Has Spent 685 Crore For Covid Patients Treatment - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా బాధితులకు ఆర్థిక భారం లేకుండా చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. 2 లక్షల మందికి పైగా బాధితులు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కోవిడ్‌కు ఉచితంగా చికిత్స చేయించుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇప్పటికీ అంటే సెప్టెంబర్‌లో కూడా 92 శాతం మంది కోవిడ్‌ రోగులు ఆరోగ్యశ్రీ కిందే ఉచితంగా చికిత్స పొందుతున్నారు. కరోనాతోపాటు బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకర్‌ మైకోసిస్‌)ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చిన సంగతి తెలిసిందే. అత్యంత ఖరీదైన చికిత్స అవసరమైన బ్లాక్‌ ఫంగస్‌ను పథకం పరిధిలోకి చేర్చడంతో చాలామంది ఆర్థిక భారం లేకుండా బయటపడ్డారు. 

రూ.685 కోట్ల వ్యయం
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కోవిడ్‌ వల్ల ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతో దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం రూ.685.72 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇంత మొత్తంలో ఖర్చు చేసిన రాష్ట్రాలు దేశంలో ఎక్కడా లేవు. పెద్ద రాష్ట్రాల్లో సైతం ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ఆస్పత్రుల్లో సొంతంగా డబ్బు చెల్లించి వైద్య సేవలు పొందారు. మన రాష్ట్రంలో మాత్రం ఉచితంగా చికిత్సలు అందించడమే కాకుండా కోవిడ్‌ నిర్ధారణ టెస్టులూ (ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌) రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఇవన్నీ ఒకెత్తయితే ఇంట్లో చికిత్స పొందుతున్న లక్షలాది మందికి కూడా ఉచితంగా హోమ్‌ ఐసొలేషన్‌ కిట్‌లు అందజేసింది.
చదవండి: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్‌

సగటున ఒక్కొక్కరికి రూ.34 వేలు వ్యయం
గతేడాది మార్చి 10న తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. మే, జూన్‌ నెలల్లో కేసులు పెరిగాయి. సెప్టెంబర్‌ నాటికి కోవిడ్‌ తీవ్రరూపం దాల్చడంతో అప్పటికే చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. గతేడాది.. మొదటి వేవ్, ఈ ఏడాది.. సెకండ్‌వేవ్‌లతో కలిపి సగటున ఒక్కో కోవిడ్‌ రోగికి ప్రభుత్వం రూ.34 వేలు వ్యయం చేసినట్టు తేలింది. ఈ ఏడాది సెపెంబర్‌ 7 వరకు ఖర్చు చేసిన లెక్కలు ఇవి. కాగా, ఇప్పటికీ 490 మందికిపైగా బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు ఆరోగ్యశ్రీ కిందనే ఉచితంగా చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా డిశ్చార్జి అయ్యాక ఖరీదైన పొసకొనజోల్‌ మాత్రలను కూడా ఉచితంగా అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్‌ చికిత్సకు పెద్ద ఎత్తున వ్యయం చేసింది రాష్ట్ర ప్రభుత్వమే అని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

కోవిడ్‌ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం ఇలా..

సంవత్సరం రోగులు వ్యయం  (రూ.కోట్లలో)
2020–21   97,171  318.83
2021–22 1,04,288 366.89
మొత్తం  2,01,459 685.72

     

Advertisement
Advertisement