ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు

AP Govt is Going to Give New Pensions to Another 3 lakh People - Sakshi

లబ్ధిదారులకు జూలై 19న మంజూరు పత్రాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించే విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది.

తర్వాత డిసెంబర్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం అందిన దరఖాస్తులపై ఈ నెల 15–23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలన చేసి దాదాపు 3 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందజేయనున్నట్టు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ అహ్మద్‌ ‘సాక్షి’కి వివరించారు.

నవరత్న కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించబడి తదుపరి పరిశీలనలో అర్హులుగా గుర్తించిన వారికి జూలై 19న ప్రత్యేకంగా ఆయా పథకాల లబ్ధిని అర్హులకు అందజేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 24న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి కూడా అదే రోజున మంజూరు పత్రాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ వివరించారు. ఇదిలా ఉండగా, జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వం ఇప్పటిదాకా దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు.  

చదవండి: (గుడివాడ టీడీపీలో తీవ్రస్థాయికి విభేదాలు.. మినీ మహానాడు సైతం రద్దు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top