
విజయవాడలో లులుకు కట్టబెట్టిన ఆర్‌టీసీ పాత బస్టాండ్ స్థలం
విశాఖ నడిబొడ్డు లులుకు సర్కారు భూ ఫలహారం
13.74 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి 99 ఏళ్లకు లీజు
విజయవాడలో రూ.156 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్ల విలువైన భూమి
ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇదే లులుకు 99 ఏళ్లు అప్పగింత
ఇందుకు ప్రత్నామ్నాయంగా ఆర్టీసీకి మరో చోట భూమి
మెగా ఫుడ్‌పార్కులోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా లులుకే
జనసేన ఎంపీ బాలశౌరికి చెందిన అవిశా ఫుడ్‌కు 115.65 ఎకరాలు
రూ.104 కోట్ల విలువైన ఈ భూమి రూ.19.08 కోట్లకే కట్టబెట్టిన వైనం
శ్రీకాకుళంలో వీఎస్‌ఆర్ గ్రూపునకు ఎకరా రూ.11.62 లక్షలతో 22.45 ఎకరాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్తులు, ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను అయిన వారికి పప్పుబెల్లాలుగా పంచేస్తోంది. ఏదైనా ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలన్నా, లేక విక్రయించాలనుకున్నా వేలం లేదా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి అధికాదాయం కల్పించే వారికి అప్పగిస్తారు. కానీ కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఈ సంప్రదాయాన్ని పక్కకు పెట్టి నీకింత–నాకింత అంటూ అడ్డుగోలు భూ దోపిడీకి తెరతీస్తోంది.
ఈ పరంపరలో వేలంపాట, టెండర్లు లేకుండానే విశాఖ, విజయవాడల్లో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూపునకు అప్పగించేసింది. ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ పేరిట అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న లులు గ్రూపునకు విశాఖలో వాల్తేరు హార్బర్‌పార్కు వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలు 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు వసూలు చేస్తారు.
అంటే చదరపు అడుగుకు నెలకు రూ.1.50 చొçప్పున ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు అద్దె చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో అయితే వాణిజ్య భవనాల్లో చదరపు అడుగుకు రూ.80 నుంచి 100 పలుకుతుంటే.. విశాఖలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. కానీ లులుకు కేవలం రూ.1.50కే కట్టబెడుతోంది. ప్రతీ పదేళ్లకు కేవలం 10 శాతం అద్దె పెంచుతారట! విశాఖలో రూ.1,066 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
రూ.679.50 కోట్ల విలువైన భూమిని లులుకు అడ్డగోలుగా ఇవ్వడాన్ని గత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ.. ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వీఎంఆర్డీఏకు అప్పగించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే వీఎంఆర్‌డీఏ నుంచి భూమిని ఏపీఐఐసీకి అప్పగించి.. ఇప్పుడు లులుకు కట్టబెట్టింది.
విజయవాడలో 4.15 ఎకరాలు లులుకు అప్పగింత
విజయవాడలో లులుపై ప్రభుత్వం మరింత ప్రేమ కనబరిచింది. రూ.156 కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేసింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా పిలుచుకునే గవర్నరుపేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులు చేతిలో పెట్టింది. కేవలం రూ.156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఈ షాపింగ్ మాల్‌ను లులు అభివృద్ధి చేయనుంది. ఇందుకుగాను 99 సంవత్సరాల కాల పరిమితికి లీజు విధానంలో ఈ భూమిని లులుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
ఇందుకుగాను ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించాల్సిందిగా యువరాజ్ ఆ ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ భూములను లూలుకు అప్పగించడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోపాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేకించినా, ప్రభుత్వం మాత్రం భూములు కట్టబెడుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మల్లవల్లి మెగా ఫుడ్‌పార్కులోని సెంట్రల్ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్‌ను కూడా లులుకు అప్పగించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమి
జనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్‌కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్‌పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
అలాగే ఢిల్లీకి చెందిన ఏస్ ఇంటర్నేషనల్‌కు చిత్తూరులో డెయిరీ యూనిట్ ఏర్పాటు చేయడానికి మార్కెట్ ధర ప్రకారం 73.63 ఎకరాలను కేటాయించింది. మొత్తం అయిదు దశల్లో ఏస్ ఇంటర్నేషనల్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌కు చెందిన వీఎస్‌ఆర్ సర్కన్ ఇండస్ట్రీస్ రూ.39.22 కోట్లతో ఏర్పాటు చేసే బ్రిక్ యూనిట్‌కు శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఎకరా రూ.11.62 లక్షలు చొప్పున 22.45 ఎకరాలు కేటాయిస్తూ మరో జీవో విడుదల చేసింది.
అనకాపల్లి జిల్లా రాంబిల్ల వద్ద లారస్ ల్యాబ్ రూ.5,374 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫార్మా యూనిట్‌కు ఎకరా రూ.30 లక్షలు చొప్పున 531.77 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్‌కు 2031 జూలై 1 తర్వాత నుంచి అమల్లోకి వచ్చే విధంగా 695.35 ఎకరాల లీజు గడువును మరో 25 సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పరెల్‌తో పాటు ఫుట్‌వేర్, టాయ్స్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.