breaking news
expensive land
-
చదరపు అడుగు రూపాయిన్నర!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్తులు, ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను అయిన వారికి పప్పుబెల్లాలుగా పంచేస్తోంది. ఏదైనా ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలన్నా, లేక విక్రయించాలనుకున్నా వేలం లేదా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి అధికాదాయం కల్పించే వారికి అప్పగిస్తారు. కానీ కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఈ సంప్రదాయాన్ని పక్కకు పెట్టి నీకింత–నాకింత అంటూ అడ్డుగోలు భూ దోపిడీకి తెరతీస్తోంది.ఈ పరంపరలో వేలంపాట, టెండర్లు లేకుండానే విశాఖ, విజయవాడల్లో అత్యంత ఖరీదైన భూములను లులు గ్రూపునకు అప్పగించేసింది. ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ పేరిట అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న లులు గ్రూపునకు విశాఖలో వాల్తేరు హార్బర్‌పార్కు వద్ద ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్న అత్యంత ఖరీదైన 13.74 ఎకరాలు 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి మూడు సంవత్సరాలు ఎటువంటి లీజు లేకుండా నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి లీజు వసూలు చేస్తారు.అంటే చదరపు అడుగుకు నెలకు రూ.1.50 చొçప్పున ఏడాదికి రూ.4.51 కోట్లు ప్రభుత్వానికి లులు అద్దె చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో అయితే వాణిజ్య భవనాల్లో చదరపు అడుగుకు రూ.80 నుంచి 100 పలుకుతుంటే.. విశాఖలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. కానీ లులుకు కేవలం రూ.1.50కే కట్టబెడుతోంది. ప్రతీ పదేళ్లకు కేవలం 10 శాతం అద్దె పెంచుతారట! విశాఖలో రూ.1,066 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ షాపింగ్ మాల్ 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.రూ.679.50 కోట్ల విలువైన భూమిని లులుకు అడ్డగోలుగా ఇవ్వడాన్ని గత ప్రభుత్వం వ్యతిరేకిస్తూ.. ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వీఎంఆర్డీఏకు అప్పగించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే వీఎంఆర్డీఏ నుంచి భూమిని ఏపీఐఐసీకి అప్పగించి.. ఇప్పుడు లులుకు కట్టబెట్టింది.విజయవాడలో 4.15 ఎకరాలు లులుకు అప్పగింత విజయవాడలో లులుపై ప్రభుత్వం మరింత ప్రేమ కనబరిచింది. రూ.156 కోట్ల పెట్టుబడి కోసం ఏకంగా రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేసింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా పిలుచుకునే గవర్నరుపేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని లులు చేతిలో పెట్టింది. కేవలం రూ.156 కోట్ల పెట్టుబడితో 2.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఈ షాపింగ్ మాల్‌ను లులు అభివృద్ధి చేయనుంది. ఇందుకుగాను 99 సంవత్సరాల కాల పరిమితికి లీజు విధానంలో ఈ భూమిని లులుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.ఇందుకుగాను ఏపీఎస్ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమిని కేటాయించాల్సిందిగా యువరాజ్ ఆ ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ భూములను లూలుకు అప్పగించడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోపాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేకించినా, ప్రభుత్వం మాత్రం భూములు కట్టబెడుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మల్లవల్లి మెగా ఫుడ్పార్కులోని సెంట్రల్ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్‌ను కూడా లులుకు అప్పగించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమిజనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్‌కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్‌పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.అలాగే ఢిల్లీకి చెందిన ఏస్ ఇంటర్నేషనల్‌కు చిత్తూరులో డెయిరీ యూనిట్ ఏర్పాటు చేయడానికి మార్కెట్ ధర ప్రకారం 73.63 ఎకరాలను కేటాయించింది. మొత్తం అయిదు దశల్లో ఏస్ ఇంటర్నేషనల్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్‌కు చెందిన వీఎస్ఆర్ సర్కన్ ఇండస్ట్రీస్ రూ.39.22 కోట్లతో ఏర్పాటు చేసే బ్రిక్ యూనిట్‌కు శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఎకరా రూ.11.62 లక్షలు చొప్పున 22.45 ఎకరాలు కేటాయిస్తూ మరో జీవో విడుదల చేసింది.అనకాపల్లి జిల్లా రాంబిల్ల వద్ద లారస్ ల్యాబ్ రూ.5,374 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫార్మా యూనిట్‌కు ఎకరా రూ.30 లక్షలు చొప్పున 531.77 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్కు 2031 జూలై 1 తర్వాత నుంచి అమల్లోకి వచ్చే విధంగా 695.35 ఎకరాల లీజు గడువును మరో 25 సంవత్సరాలకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పరెల్తో పాటు ఫుట్‌వేర్, టాయ్స్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. -
‘భూ’ ప్రకంపనలు!
వుడాలో కమ్యూనిటీ స్థలాల కేటాయింపు, ల్యాండ్‌పూలింగ్ కేసు దర్యాప్తు ప్రకంపనలు సృష్టిస్తోంది. థర్డ్‌పార్టీ రిజిస్ట్రేషన్లు...బినామీల బాగోతం... ముడుపుల వ్యవహారం...అధికార దందా...ఇలా అంతులేని వ్యవహారాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. బాధ్యుల సంఖ్య ఏడు పదులు దాటుతుండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతా కూడబలుక్కుని కుట్రకు తెరలేపారని, ఖరీదైన భూములను సొంతం చేసుకున్నారని సీఐడీ అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇక అరెస్టుల పర్వమే మిగిలి ఉంది. సాక్షి, విశాఖపట్నం: వుడా ల్యాండ్ పూలింగ్ వ్యవహారం అధికారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. దాదాపు రూ.540 కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడలో భాగస్వాములైన వారి లిస్టుచూసి సీఐడీ అధికారులే నోరెళ్లబెడుతున్నారు. అధికారులు, ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, రియల్టర్లు...ఇలా అంతా కూడబలుక్కుని, గూడుపుఠానీ అయి కుట్రపూరితంగా భారీ అవినీతికి తెరలేపారని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కథ నడిపించేందుకు ప్రత్యామ్నాయ రికార్డులు సృష్టించారని, బినామీలతో వ్యవహారాన్ని కొనసాగించారని తేల్చారు. అడ్డొచ్చిన వాళ్లకు ముడుపులు పంచారని, మాట విననివారిపై అధికారదందా ప్రయోగించారని, మొత్తమ్మీద పరిస్థితిని అన్నివిధాలుగా తమకు అనుకూలంగా మార్చుకుని విలువైన స్థలాలను తెలివిగా కబ్జా చేసి పంచుకున్నారని విచారణాధికారులు భావిస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని కమ్యూనిటీ సెంటర్ స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా కొందరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన తీగలాగితే ల్యాండ్‌పూలింగ్ వ్యవహారం డొంక కదిలిన విషయం తెలిసిందే. రెండువ్యవహారాల్లోనూ ప్రమేయం ఉన్న వారు ఒక్కరే అని తేలడంతో ప్రభుత్వం ఈ కేసునూ సీఐడీకి అప్పగించింది. అధికారుల విచారణలో బడాబాబులే బయటకు వస్తుండడంతో నోరెళ్లబెడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 నుంచి 70 మంది వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. దీంతో ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారందరిపైనా దృష్టిపెట్టారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు పదవీ విరమణ చేసిన వారి ప్రమేయాన్ని నిర్థారించి అవసరమైతే అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్లాన్టాంపరింగ్, తప్పుడు రికార్డులు సృష్టించడం, అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేయడం, తెలిసీ తెలియనట్లు వ్యవహరించడం వంటి పలు అభియోగాలను నమోదు చేస్తున్నారు. అడ్డగోలుగా ప్లాట్లు దక్కించుకున్న వారికి ప్లానింగ్ అనుమతులిచ్చిన జీవీఎంసీ సిబ్బందినీ వదలకూడదని నిర్ణయించారు. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న ఎంవీపీ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు రియల్ ఎస్టేట్ యజమానులు, స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొనసాగుతున్న మధ్యవర్తులు, పలువురు ప్రజాప్రతినిధుల ప్రమేయంపై లోతుగా విచారిస్తున్నారు. వీరిలో చాలామంది అరెస్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక రియల్టర్ల గురించి చెప్పక్కర్లేదు. రియల్ ఎస్టేట్‌కు స్వర్గధామంగా ఉన్న మధురవాడలో అప్పటి అధికారులు ల్యాండ్‌పూలింగ్ పేరిట బడాబాబులకు కారుచౌకగా భూములు కట్టబెట్టారని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో వీరు బినామీల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, ఈ క్రమంలోనే కొందరు కారు డ్రైవర్లు, మెకానిక్‌లు కోటీశ్వరులయ్యారని తేల్చారు. అందుకే ఈ రెండు కేసుల నిందితుల జాబితా 70 వరకు ఉంటుందని నిర్థారించారు. వీరందరిపైనా ప్రస్తుతం సీఐడీ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మిగిలిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాలతో ప్రమేయం ఉన్నవారిలో గుబులు పట్టుకుంది. విచారణాధికారులకు చిక్కకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారని సమాచారం. కొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకునే పనిలో పడ్డారు. మొత్తానికి సీఐడీ అరెస్టు పర్వంతో అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. అయితే సీఐడీ అధికారులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులకు ముందస్తు, సత్వర బెయిల్ రాకుండా ఉన్నత న్యాయస్థానంలో రిట్‌పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇది వాస్తవమైతే చిక్కిన వారికి బెయిలు రావడం అంత ఆషామాషీ కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.