‘భూ’ ప్రకంపనలు! | Lyandpuling sensational elements of the case | Sakshi
Sakshi News home page

‘భూ’ ప్రకంపనలు!

Sep 2 2013 1:55 AM | Updated on Sep 1 2017 10:21 PM

వుడాలో కమ్యూనిటీ స్థలాల కేటాయింపు, ల్యాండ్‌పూలింగ్ కేసు దర్యాప్తు ప్రకంపనలు సృష్టిస్తోంది. థర్డ్‌పార్టీ రిజిస్ట్రేషన్లు...బినామీల బాగోతం... ముడుపుల వ్యవహారం...

వుడాలో కమ్యూనిటీ స్థలాల కేటాయింపు, ల్యాండ్‌పూలింగ్ కేసు దర్యాప్తు ప్రకంపనలు సృష్టిస్తోంది. థర్డ్‌పార్టీ రిజిస్ట్రేషన్లు...బినామీల బాగోతం... ముడుపుల వ్యవహారం...అధికార దందా...ఇలా అంతులేని వ్యవహారాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. బాధ్యుల సంఖ్య ఏడు పదులు దాటుతుండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతా కూడబలుక్కుని కుట్రకు తెరలేపారని, ఖరీదైన భూములను సొంతం చేసుకున్నారని సీఐడీ అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇక అరెస్టుల పర్వమే మిగిలి ఉంది.
 
సాక్షి, విశాఖపట్నం: వుడా ల్యాండ్ పూలింగ్ వ్యవహారం అధికారుల్లో గుబులు రేకెత్తిస్తోంది. దాదాపు రూ.540 కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడలో భాగస్వాములైన వారి లిస్టుచూసి సీఐడీ అధికారులే నోరెళ్లబెడుతున్నారు. అధికారులు, ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, రియల్టర్లు...ఇలా అంతా కూడబలుక్కుని, గూడుపుఠానీ అయి కుట్రపూరితంగా భారీ అవినీతికి తెరలేపారని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

కథ నడిపించేందుకు ప్రత్యామ్నాయ రికార్డులు సృష్టించారని, బినామీలతో వ్యవహారాన్ని కొనసాగించారని తేల్చారు. అడ్డొచ్చిన వాళ్లకు ముడుపులు పంచారని, మాట విననివారిపై అధికారదందా ప్రయోగించారని, మొత్తమ్మీద పరిస్థితిని అన్నివిధాలుగా తమకు అనుకూలంగా మార్చుకుని విలువైన స్థలాలను తెలివిగా కబ్జా చేసి పంచుకున్నారని విచారణాధికారులు భావిస్తున్నారు. ఎంవీపీ కాలనీలోని కమ్యూనిటీ సెంటర్ స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా కొందరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన తీగలాగితే ల్యాండ్‌పూలింగ్ వ్యవహారం డొంక కదిలిన విషయం తెలిసిందే.

రెండువ్యవహారాల్లోనూ ప్రమేయం ఉన్న వారు ఒక్కరే అని తేలడంతో ప్రభుత్వం ఈ కేసునూ సీఐడీకి అప్పగించింది. అధికారుల విచారణలో బడాబాబులే బయటకు వస్తుండడంతో నోరెళ్లబెడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60 నుంచి 70 మంది వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. దీంతో ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారందరిపైనా దృష్టిపెట్టారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు పదవీ విరమణ చేసిన వారి ప్రమేయాన్ని నిర్థారించి అవసరమైతే అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
 
ప్లాన్‌టాంపరింగ్, తప్పుడు రికార్డులు సృష్టించడం, అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేయడం, తెలిసీ తెలియనట్లు వ్యవహరించడం వంటి పలు అభియోగాలను నమోదు చేస్తున్నారు. అడ్డగోలుగా ప్లాట్లు దక్కించుకున్న వారికి ప్లానింగ్ అనుమతులిచ్చిన జీవీఎంసీ సిబ్బందినీ వదలకూడదని నిర్ణయించారు. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న ఎంవీపీ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు రియల్ ఎస్టేట్ యజమానులు, స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొనసాగుతున్న మధ్యవర్తులు, పలువురు ప్రజాప్రతినిధుల ప్రమేయంపై లోతుగా విచారిస్తున్నారు. వీరిలో చాలామంది అరెస్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక రియల్టర్ల గురించి చెప్పక్కర్లేదు. రియల్ ఎస్టేట్‌కు స్వర్గధామంగా ఉన్న మధురవాడలో అప్పటి అధికారులు ల్యాండ్‌పూలింగ్ పేరిట  బడాబాబులకు  కారుచౌకగా భూములు కట్టబెట్టారని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో వీరు బినామీల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, ఈ క్రమంలోనే కొందరు కారు డ్రైవర్లు, మెకానిక్‌లు కోటీశ్వరులయ్యారని తేల్చారు. అందుకే ఈ రెండు కేసుల నిందితుల జాబితా 70 వరకు ఉంటుందని నిర్థారించారు. వీరందరిపైనా ప్రస్తుతం సీఐడీ అధికారులు దృష్టిసారించారు.
 
ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మిగిలిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాలతో ప్రమేయం ఉన్నవారిలో గుబులు పట్టుకుంది. విచారణాధికారులకు చిక్కకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారని సమాచారం. కొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకునే పనిలో పడ్డారు. మొత్తానికి సీఐడీ అరెస్టు పర్వంతో అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. అయితే సీఐడీ అధికారులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులకు ముందస్తు, సత్వర బెయిల్ రాకుండా ఉన్నత న్యాయస్థానంలో రిట్‌పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇది వాస్తవమైతే చిక్కిన వారికి బెయిలు రావడం అంత ఆషామాషీ కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement