ఎన్ని విడతలు తీసుకున్నా మొదటి విడత పూలింగ్‌లో ఇచ్చిన రాయితీలే రైతులకు ఇస్తాం
కౌలు పెంచే అవకాశం లేదు: మంత్రి నారాయణ
సాక్షి, అమరావతి: రాజధానిలో మూడో దశ ల్యాండ్ పూలింగ్‌కు కచ్చితంగా వెళ్తామని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఎంత భూమి సేకరించాలన్నదానిపై వర్కవుట్ చేస్తున్నామన్నారు. కనీసం మరో 20వేల నుంచి 25వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రెండో విడతలో ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, రైల్వేట్రాక్, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల రైతుల నుంచి 16,666.57 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించాలని నిర్ణయించామని తెలిపారు.
వీటితోపాటు 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉందన్నారు. రాజధానిలో రాబోయే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవనస్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అమరావతి రాజధానిలో భూముల రేట్లు పెరగాలన్నా, గ్రోత్ రేటు పెరగాలన్నా కచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు ఉండాలన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లేనిదే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. రెండో దశలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు సమీకరిస్తున్నామని చెప్పారు.
గతంలోని నిబంధనలే వర్తింపు...
ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చే రైతులకు గతంలో ఇచ్చిన విధంగానే నిబంధనలు వర్తిస్తాయని నారాయణ చెప్పారు. జరీబు భూములు ఇచ్చిన వారికి నివాస ప్లాటు కింద 1,000 చదరపు గజాలు, వాణిజ్య ప్లాటు కింద 450 చదరపు గజాలు, మెట్ట భూములు ఇచ్చిన వారికి నివాస ప్లాట్ కింద 1,000చదరపు గజాలు, వాణిజ్య ప్లాట్ కింద 250 చదరపు గజాలు కేటాయిస్తామన్నారు. కౌలు కూడా గతంలో మాదిరిగానే చెల్లిస్తామని, పెంచే ఆలోచన లేదని నారాయణ తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పంపించిన తీర్మానాలను కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు.
గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు కేటాయించగా, ఒలింపిక్స్ వంటి ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించే స్థాయిలో ఈ సిటీని తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం 2,500 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం నిర్ణయించారని నారాయణ వెల్లడించారు. అందుకోసమే స్పోర్ట్స్ సిటికీ భూ కేటాయింపులు పెంచుతున్నామన్నారు. గతంలో భూములిచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చామన్నారు. కొన్నిచోట్ల ప్లాట్ల కేటాయింపుపై ఉన్న సమస్యలు నెల రోజుల్లో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. గ్రామ కంఠాల విషయంలో ఎవరికైనా పొరపాటున ఎక్కువ భూమి ఇచ్చి ఉంటే మళ్లీ వెనక్కి తీసుకుంటామని మంత్రి చెప్పారు. మరోవైపు అసైన్డ్ రైతుల సమస్యను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తుందని తెలిపారు.


