7 రాజధాని గ్రామాల్లో రెండో దశ పూలింగ్‌కు కేబినెట్ ఆమోదం
మరో 3,828 ఎకరాలు అసైన్డ్, పోరంబోకు భూములు కూడా..
ఇంధన శాఖకు రూ.3,762.26 కోట్ల నాబార్డు రుణం మంజూరుకు ఆమోదం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రారంభించి రైతుల నుంచి భూమి తీసుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరో 3,828 ఎకరాల అసైన్డ్, పోరంబోకు భూమిని రాజధాని కోసం తీసుకోనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన భూములను సమీకరణలో తీసుకుంటామని, ఇందులో భాగంగా దేవదాయ, వక్ఫ్ భూములున్నా నిబంధనల మేరకు తీసుకుంటామని స్పష్టం చేశారు.
⇒ ధాన్యం సేకరణ కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం.
⇒ ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలపై సోలార్ రూఫ్ టాప్ కోసం నాబార్డు నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో డిస్కమ్‌లు రూ.3,762.26 కోట్లు రుణం పొందేందుకు ఆమోదం.
⇒ రాష్ట్ర నూర్ బాషా, దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను రద్దు చేసి ఏపీ నూర్ బాషా, దూదేకుల కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటుకు ఆమోదం.
⇒ పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలకు ఆమోదం. పట్టణ స్థానిక సంస్థల్లో రెగ్యులేషన్, డిస్‌ప్లే కంట్రోల్ డివైజెస్ ఏర్పాటు. నిర్మాణ సమయంలో ఖాళీ భూమిపై పన్ను మినహాయింపు కోసం మునిసిపాలిటీల చట్టం 1965, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం 1955సవరణలకు ఆమోదం.
⇒ ఒడిశా పవర్ కన్సార్షియంకు రెండు ప్రాజెక్టులు కేటాయిపు.
⇒ భారత్ నెట్‌లో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం.
⇒ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ బలోపేతంలో భాగంగా 16 పోస్టులు డిప్యుటేషన్/కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియామకానికి ఆమోదం.
⇒ పోలవరం పనులకు రూ.542.85కోట్లతో పరిపాలన అనుమతి.
⇒ గతేడాది జూన్ 15 వరకు తెల్లపేపర్‌పై అగ్రిమెంట్ చేసుకున్న చిన్న, సామాన్య రైతుల భూముల లావాదేవీల క్రమబద్ధీకరణకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించేందుకు చట్ట సవరణలకు ఆమోదం.
⇒ తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఎకరా రూ.2.5 కోట్ల విలువైన భూమి ఉచితంగా స్పోర్ట్స్ అథారిటీకి బదిలీ చేసేందుకు ఆమోదం.
⇒ ఇతర రాష్ట్రాలలో మరణించిన వారి వారసత్వ వ్యవసాయ ఆస్తుల బదిలీ విషయంలో విభజన డీడ్‌లపై స్టాంప్ డ్యూటీని నిర్దేశిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం.
అమరావతి రైతులు పూర్తి సంతృప్తిగా ఉన్నారు!
మంత్రులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్య
రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు పూర్తి సంతృప్తిగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


