మిగతా 50 శాతం వైద్య సీట్లు మేనేజ్‌మెంట్, ఎన్నారై కోటాలో భర్తీ
తొలుత 33 ఏళ్లు, అనంతరం మరో 33 ఏళ్లు లీజు
లీజు ధర ఎకరానికి ఏడాదికి రూ.100
రెండేళ్లపాటు ప్రభుత్వ బోధనాస్పత్రులను వినియోగించుకునేందుకు అనుమతి
నాలుగు వైద్య కళాశాలలకు భూ కేటాయింపుల్లో 59.89 ఎకరాలు తగ్గింపు
ఇకపై ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
సాక్షి,అమరాతి: పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపడుతున్న ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద 50 శాతం సీట్లు భర్తీ చేసి, మిగతావి యాజమాన్యం, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తొలుత 33 ఏళ్లపాటు, తర్వాత మరో 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాదికి ఎకరానికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ సంస్థలు ఆస్పత్రులను నిర్మాణం చేసుకునే వరకు రెండేళ్లపాటు ప్రభుత్వ బోధనాస్పత్రులను వినియోగించుకునేందుకు అనుమతించారు. అప్పటివరకు ప్రస్తుత ఆస్పత్రుల్లోని సిబ్బంది జీతభత్యాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రీ బిడ్ సమావేశాల్లో పీపీపీ సంస్థలు కోరిన మేరకు ఆర్‌ఎఫ్‌పీలో 6 సవరణలను ఆమోదించినట్లు చెప్పారు.
కాలేజీలకు 59.89 ఎకరాలు కుదింపు..
పీపీపీ ఆస్పత్రుల్లో 70 శాతం పడకలు ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు కేటాయిస్తారు. మిగతా 30 శాతం పడకలకు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకుంటాయి. గతంలో ఈ నాలుగు కొత్త వైద్య కళాశాలలకు 257.60 ఎకరాలను కేటాయించగా, ఇప్పుడు 197.71 ఎకరాలకు తగ్గించారు. భవిష్యత్తులో డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ ఇన్‌స్టిట్యూట్, ఆయుష్, శిక్షణ, పరిశోధన కేంద్రాల అభివృద్ధికి అనుమతిస్తారు. అయితే వాటి నుంచి వచ్చే ఆదాయంలో 3శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. వైద్య కళాశాలలు, ఆస్పత్రులు ప్రభుత్వ, ప్రైవేట్ బ్రాండింగ్‌తో పని చేస్తాయి. 30 శాతం వరకు ప్రైవేట్ బ్రాండింగ్ ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలుగా పెద్దగా పేరు పెట్టి కింద పీపీపీ సంస్థల పేర్లు పొందుపరుస్తారు. వచ్చే నెల 10వ తేదీ వరకు బిడ్ల సమర్పణకు గడువు ఉంది. డిసెంబర్ 31న బిడ్డర్లను ప్రకటిస్తారు.
నియంత్రణ పరిధిలోకి ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులు
అర్హతలు లేని, నకిలీ వైద్యులు ఆస్పత్రులను నిర్వహించకుండా నియంత్రించేందుకు ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజి్రస్టేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2010 పరిధిలోకి తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రైవేట్ అల్లోపతిక్ ఆస్పత్రులను మాత్రమే ఈ చట్టం కింద నియంత్రిస్తున్నారు. చట్ట సవరణ ద్వారా ఇకపై ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులను కూడా నియంత్రిస్తారు. దీంతో ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్యం అందించే ప్రైవేట్ ఆస్పత్రులు నియంత్రణ పరిధిలోకి రానున్నాయి.


