జేసీ మనుషులమంటూ దౌర్జన్యం 

AP Government Cement To Karnataka Illegally - Sakshi

కర్ణాటకలో ప్రైవేట్‌ కట్టడాలకు  ఏపీ ప్రభుత్వ  సిమెంట్‌

ప్రశ్నిస్తే జేసీ ప్రభాకరరెడ్డి పేరు  చెప్పి బెదిరింపులు

భయపడి వెనుదిరిగిన అధికారులు

చిలమత్తూరు(శ్రీసత్యసాయి జిల్లా):  తాము జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తమను ప్రశ్నించినా... చర్యలను అడ్డుకున్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు దౌర్జన్యానికి దిగారు. వివరాలు... రాష్ట్రంలో ప్రభుత్వ భవన నిర్మాణాలకు సరఫరా చేసిన సిమెంట్‌ కర్ణాటకకు యథేచ్ఛగా తరలిపోతోంది. వందలాది సిమెంట్‌ బస్తాలు కర్ణాటక ప్రాంతంలోని ప్రైవేట్‌ భవన నిర్మాణాలకు వినియోగిస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం బాగేపల్లిలో ప్రైవేట్‌ భవన నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ సిమెంట్‌ వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న చిలమత్తూరు మండల అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ సమయంలో అక్కడి వారు అధికారులను అడ్డుకున్నారు. ఫొటోలు డెలిట్‌ చేయాలని బలవంతం చేశారు. తాము తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తాము తలుచుకుంటే అక్కడి నుంచి అడుగు కూడా పక్కకు వేయలేరంటూ బెదిరింపులకు దిగారు. అవసరమైతే జేసీ ప్రభాకరరెడ్డితో ఫోన్‌లో మాట్లాడిస్తామంటూ దౌర్జన్యానికి దిగారు.

విచారణలు, దర్యాప్తులు ఏవైనా ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని తమ ప్రాంతానికి వచ్చి ప్రశ్నిస్తే తిరిగి వెళ్లలేరంటూ హెచ్చరించడంతో మారు మాట్లాడకుండా అధికారులు వెనుదిరిగి వచ్చారు. ఈ విషయంగా చిలమత్తూరు ఎంపీడీఓ రామ్‌కుమార్‌ను వివరణ కోరగా... అక్కడ వినియోగిస్తున్న సిమెంట్‌ ఏపీ ప్రభుత్వం సరఫరా చేసిందేనని స్పష్టం చేశారు. అయితే అది చిలమత్తూరు మండలానికి సంబంధించినది కాదన్నారు. భవన యాజమాన్యం మాట్లాడిన తీరును బట్టి అది కచ్చితంగా అనంతపురం జిల్లా నుంచే సరఫరా అయినట్లుగా తెలుస్తోందన్నారు. దీనిపై లోతైన విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top